ఆశ్చర్యపరిచే,  అద్భుతమైన శిల్పసంపద హేమవతి సిద్దేశ్వరాలయం (Hemavathi Siddeshwara Temple) సొంతం. చోళుల కాలంలో నోళంబు రాజుల ఆధ్వర్యంలో క్రీ.శ. 730లో నిర్మితమైన శైవ క్షేత్రంపై మహా శివరాత్రి పర్వదినాన ప్రత్యేక కథనం. పుర్రెలమాలతో పరమశివుడు ఇక్కడ దర్శనమిస్తారు. మానవ రూపంలో దర్శనమిస్తున్న శైవ క్షేత్రం వివరాలు మీకోసం..


చోళుల కాలంలో నిర్మించిన ఆలయం.. 
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన హేమవతి సిద్దేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో వారి సామంత రాజులైన  నోళంబు రాజులు క్రీస్తు శకం 730లో ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికి పదమూడు వందల సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు చెదరని అద్భుతమైన శిల్ప సంపద ఆ శైవక్షేత్రం సొంతం. శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగుతాయి. ఈ క్షేత్రంలో పరమశివుని మూలవిరాట్ మానవ రూపంలో దర్శనమివ్వడం ఓ ప్రత్యేకత .సాధారణంగా ఏ శైవ క్షేత్రాన్ని సందర్శించినా లయకారుడు లింగరూపంలోనే దర్శనమిస్తుంటారు. అందుకు భిన్నంగా సిద్ధ ముద్ర లో ఆసీనుడైన హరుడు మానవ రూపంలో దర్శనమిస్తూ భక్తులకు ప్రీతిపాత్రులయ్యారు. 


ఆలయం చుట్టూ  విశాలమైన ప్రాకారం అప్పట్లోనే నిర్మించారు. నోళంబులు ఇష్టదైవంగా కొలిచే శివయ్య ఆలయాన్ని తమ రాజధాని నగరం హేమావతి లో నిర్మించుకున్నారు. ఆయన ఆశీస్సులతో రాజ్యపాలన చేశారని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. సుమారు 36 వేల గ్రామాలను హేమావతి నుంచి పాలించేవారు. దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా శివయ్య మూర్తిని మానవ  ఆకారంలో ప్రతిష్టించారు.  ఆలయంలోని ముఖ మంటపంలోకి  అడుగుపెట్టగానే అక్కడి స్తంభాలపై నోళంబుల రాజ్య చిహ్నంతో పాటు రాజ్య విశేషాలు చెక్కించారు. మరో మూల స్తంభం పై  పార్వతీ మాత కోరిక మేరకు పరమేశ్వరుడు అర్జునునితో తలపడిన దృశ్యాలు దర్శనమిస్తాయి. మరో స్తంభంపై  ప్రశాంత వదనుడైన శివుడు రుద్రుడై తపోభంగం కలిగించిన మన్మధున్ని సంహరించే విషయాన్ని చిత్రమాలికలు అద్భుతంగా శిల్పులు చెక్కినారు. 


జటాజూటధారియైన శివయ్య.. 
ఆలయంలోని మరో మండపంలో శివయ్యను పూజించే విధానాలు అక్కడి శిల్పాలపై  మనం చూడవచ్చు. మరి కొంచెం ముందుకు వెళితే స్వామి వారి గర్భగుడి ముందు చిన్నపాటి మరో మండపం ఉంటుంది. అక్కడిదాకా పాలకులు వెళ్లి తన ఇష్టదైవమైన శివునికి పూజలు చేసేవారట. గర్భగుడిలో ఐదు అడుగుల మూర్తిగా బోలా శంకరుడు దర్శనమిస్తారు. జటాజూటధారియై  తలపైన గంగను, ఎడమ వైపున చంద్రున్ని కలిగి  ప్రకృతిపై తన మమకారాన్ని చెప్పకనే చెబుతుంటారు. నేడు మహాశివరాత్రి (Maha Shivratri 2022)ని పురస్కరించుకుని భక్తులు ఈ ఆలయానికి పోటెత్తారు.


తనను దర్శించే భక్తులను సూటిగా చూస్తున్నట్టు దివ్యమైన కళ్లు, తన ప్రియ భక్తులకు సందేశం ఇస్తున్నట్టు నుదుటిపై మూడు నామాలు కలిగి ఉంటారు. చతుర్భుజాలలో శంఖు, చక్ర, త్రిశూల, డమరుకాలు కలిగి అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తుంటారు. స్మశాన వాసుడైన బోళా నాథుడు అందుకు ప్రతీకగా కపాలాల మాలగా ధరించి ఉంటారు. మూర్తిని అత్యంత అద్భుతంగా చెక్కడంలో శిల్పి నైపుణ్యం వర్ణనాతీతం. శంకరుని దర్శనంతో మనసు ప్రశాంతత కు లోనుకావడం, ఆ శిల్ప సౌందర్యాన్ని చూసి తన్మయత్వానికి గురి కావడం భక్తులకు సర్వసాధారణమే. 



శైవ క్షేత్రంలో మరో 5 ఆలయాలు.. 
హేమావతి లోని శైవ క్షేత్రంలో మరో ఐదు ఆలయాలు ప్రసిద్ధిగాంచాయి. అయితే ఆ ఆలయాలలో మాత్రం హరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. పెద్ద సిద్దేశ్వర స్వామి ఆలయంలో అమృత శిలలతో తయారుచేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక మండపంలోని మూల స్తంభాలపై ఓవైపు రామాయణానికి సంబంధించిన  చిత్రమాలికలు, ఎడమవైపు ఉన్న స్తంభాలపై మహాభారత ఘట్టాలకు చెందిన చిత్రాలను అత్యంత జాగురూకతతో పొందుపరిచారు. ఆలయంలోని గోడలపై కొన్ని చోట్ల పురాతన కన్నడ భాషలో లిపి ఉంటుంది. ఆలయం వెలుపల మరో మూడు చిన్నపాటి ఆలయాలు ఉంటాయి. వీటిలో కూడా పరమేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. ప్రధాన ఆలయం ఎదుట రెండు రకాలు రథాలు ఉంటాయి. వీటిని శివరాత్రి సందర్భంగా   ఎనిమిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో  శివయ్యకు  పల్లకిలాగా వినియోగిస్తారు. ప్రధాన ఆలయానికి కుడి వైపున కాలభైరవుడు,  ఎడమవైపున వినాయకుడు క్షేత్ర పాలకులుగా కొలువై ఉన్నారు. హేమావతి ప్రాంతంలో ఇప్పటికీ ఎంతో అందంగా నిర్మించిన నందులు శివ లింగాలు లభ్యమౌతూనే ఉన్నాయి. లభించిన శివలింగాలు, నందులన్నిటినీ  ఆలయం ముందు ఉన్న ఉద్యానవనంలో ఒక క్రమపద్ధతిలో పురావస్తు శాఖ అమర్చారు.


ఫల పుష్పాలతో పవిత్ర గంగతో స్వామివారి మూలవిరాట్టును అభిషేకించి అనంతరం విశేష పుష్పాలతో అలంకరిస్తారు. ప్రతి ఆదివారం, సోమవారం శివయ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు అందుకుంటారు. శివరాత్రి సందర్భంగా 8 రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటిరోజు రుద్రాభిషేకం, అఖండ పూజలు , రెండవ రోజు భాను పల్లకి మూడోరోజు అగ్నిగుండం, నాలుగో రోజు సిరిమానోత్సవం, ఐదవ రోజు చిన్న రథోత్సవం, ఆరవ రోజు బ్రహ్మోత్సవం, ఏడోరోజు వసంతోత్సవం, 8 వ రోజు శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ ఎత్తున ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు. దీంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. భక్తుల అవసరాలు తీర్చేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తుంది. 


ఇక్కడికి చేరుకోవాలంటే ఇలా వెళ్ళాలి...
సిద్దేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే కళ్యాణదుర్గం వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కుందుర్పి, అమరాపురం మీదుగా శివయ్య సన్నిధికి చేరుకోవచ్చు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులు మడకశిరకు చేరుకొని అక్కడ నుండి 40 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. రోడ్డు మార్గంలో పచ్చని తోటలు, వక్క చెట్లు ఆహ్లాదాన్ని అందిస్తాయి. రోడ్డు పక్కన తక్కువ ధరలకే కొబ్బరి బోండాంలను స్థానికులు విక్రయిస్తుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మానవాకారంలో ఉన్న పరమశివున్ని దర్శించుకుందాం పదండి.. 


Also Read: Maha Shivratri 2022: లయకారుడైన శివుడి ప్రత్యేకత ఏంటి, అర్థనారీశ్వర తత్వం ఏం చెబుతోంది, శివరాత్రి ప్రత్యేక కథనాలు 


Also Read:  సముద్రం మధ్యలో ఆలయమా సాధ్యమేనా అంటారా..అయితే ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిందే..