ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్ష్యరాస్యత, విద్యా పరిస్థితులను తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో ఎంత మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.. దీనికి గల కారణాలేంటి.. ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి యువత అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. అవకాశం వస్తే మరిన్ని కోర్సులను తీసుకురావచ్చా.. వంటి వివరాలను సేకరించనుంది. 
సర్వేలో భాగంగా ప్రతి కుటుంబాన్ని 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం అడగనుంది. వీటితో పాటుగా కుటుంబ సభ్యుల అందరి వివరాలను సేకరిస్తుంది. నిరక్షరాసత్య రేటు పాటు చదువులు మధ్యలో ఆపేయడానికి గల కారణాలను కూడా ఇందులో విశ్లేషించనుంది. దీని కోసం.. చదవడం, రాయడం వచ్చా? వారి విద్యార్హత ఏంటి? ఎక్కడితో చదువు ఆపేశారు? అవకాశం ఉంటే మళ్లీ చదువు కొనసాగిస్తారా? వంటి వివరాలను సేకరించనుంది. 


ప్రత్యేక యాప్ ద్వారా సర్వే..
ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళగిరి మండలంలోని కాజ, తాడేపల్లి పురపాలక సంఘంలో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించింది. దీని ఫలితాల ఆధారంగా రాష్ట్రం అంతటా సర్వే చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో వీటికి ఆమోదం లభించనుందని తెలుస్తోంది. ప్రత్యేక యాప్ సాయంతో ఈ సర్వే నిర్వహించనుంది. ఈ కార్యక్రమం కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, ఈ-ప్రగతి, పాఠశాల, ఉన్నత విద్యా శాఖల సహకారం తీసుకోనుంది. 


కోవిడ్ ప్రభావం తగ్గితేనే..
ఆగస్టు 15వ తేదీ తర్వాత నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లతో ట్యాబ్‌ల ద్వారా ఈ సర్వే చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు దీని పరిశీలన బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నారు. అయితే కోవిడ్ ప్రభావం తగ్గితేనే ఈ కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
కోర్సుల్లో ఏమైనా మార్పులు కావాలా? 



  • ఉన్నత విద్యకు సంబంధించి విద్యాసంస్థలు తమకు తోచిన రీతిలో కోర్సులను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై యువత ఏమనుకుంటోంది? ఉన్నత విద్యలో ఏమైనా మార్పులు రావాలని భావిస్తోందా? దీనిపై వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను తెలుసుకోనుంది. 

  • టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. టెన్త్, ఇంటర్ తర్వాత వారు ఏం చదవాలనుకుంటున్నారు.. నైపుణ్య శిక్షణకు సంబంధించి వారి అభిరుచులు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలు రాబట్టనుంది. 

  • 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారి విద్యార్హతలు ఎలా ఉన్నాయి.. అనే విషయాలను కూడా ఈ సర్వే ద్వారా విశ్లేషించనుంది. 

  • విద్యార్థుల సమాధాలకు అనుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని కోర్సులను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే తర్వాత ఉన్నత విద్యలో ఏమైనా మార్పులు తీసుకురావాలా? లేదా గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉంది.