తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందోరోజులు పూర్తి చేసుకుంది. యువగళం పాదయాత్రకు 100 రోజులతోపాటు 1200 కిలోమీటర్ల మైలురాయిని కూడా దాటబోతోంది. ప్రస్తుతం నంద్యాలలో ఉన్న పాదయాత్ర చేస్తున్నారు. అక్కడే వందరోజుల వేడుక నిర్వహించనున్నారు. 


జనవరి 27న లోకేష్ తన పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 34 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగిందీ యాత్ర. మొత్తం 1269 కిలోమీటర్లు మేర నడిచారు లోకేష్‌.  ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సాగుతున్నారు. 






యాత్రకు పోలీసులు, ప్రభుత్వం, అధికార పక్షం అనేక అడ్డంకులు సృష్టిస్తున్నా  వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ తన యాత్రలో ముందుకు సాగుతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. వివిధ సామాజిక వర్గాలను, కూలీలను, రైతులను, మహిళలను, యువతను ఇలా అనేక వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలకు పరిష్కారం చెబుతూ యాత్ర చేస్తున్నారని తెలిపారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అంటున్నారు. 


లోకేష్ పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. పాదయాత్రకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలు చేయాలని పిలుపునిచ్చింది. 






లోకేష్ పాదయాత్రకు నందమూరి కుటుంబం కూడా సంఘీభవం తెలుపుతోంది. ఇప్పటికే బాలకృష్ణ ఆయనతో కలిసి నడిచారు. మొన్నీ మధ్య బాలకృష్ణ రెండో కుమార్తె పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు లోకేష్ తల్లి భువనేశ్వరి కూడా లోకేష్‌ పాదయాత్రలో పాల్గోనున్నారు. మదర్స్‌డే సందర్భంగా భువనేశ్వరి నిన్న నంద్యాల చేరుకున్నారు. 






లోకేష్ పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేత కేశినేని చిన్న జ‌న‌హృద‌య‌మై నారా లోకేష్‌పేరుతో ప్రత్యేక సంచికను విడుదల చేశారు. యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల వద్ద ఆయన లోకేష్‌తో సమావేశమయ్యారు. 






టీడీపీ అధినాయకత్వం పిలుపు మేరకు వివిధ నియోజకవర్గాల్లో సంఘీభావ యాత్రలు ప్రారంభమయ్యాయి. వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టాయి. అనకాపల్లి జిల్లాలో ఉదయం నెహ్రూ చౌక్ జంక్షన్ నుంచి సంఘీభావ పాదయాత్ర ప్రారంభమైంది. 


Also Read: చంద్రబాబుకు బిగ్ షాక్, కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ అటాచ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం 


Also Read: చంద్రబాబు ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలి- క్విడ్ ప్రోకోపై పేర్ని నాని సవాల్