ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం(మే 15) ప్రారంభమయ్యాయి. మే 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్షలకు 'ఒక్క నిమిషం' నిబంధనను అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.  మే19 వరకు ఎంపీసీ గ్రూప్‌ వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్‌ వారికి ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ హాల్‌‌టికెట్‌లో పొరపాట్లు ఉంటే సహాయకేంద్రానికి ఫోన్‌ ద్వారా, లేదా మెయిల్‌ పంపి సరిచేయించుకోవచ్చన్నారు. ఈ సారి మొత్తం 136 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 129, తెలంగాణలో 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 


ఏపీఈఏపీసెట్ పరీక్ష మొదటిరోజైన మే 15న ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభంకాగా.. విద్యార్థులను 7.30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ఆరంభమయ్యే పరీక్షకు 1.30 నుంచే అనుమతించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్‌ కార్డును వెంట తీసుకెళ్లాలి. జిరాక్స్‌, స్కాన్డ్‌ కాపీలను అనుమతించరు. గోరింటాకు పెట్టుకున్నా పరీక్షకు అనుమతించరు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ సూచించారు. 


ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055; అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.


Also Read:


డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత కూడా ఆపేయవచ్చు. మూడేళ్ల తర్వాత నిలిపివేసిన విద్యార్థులకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కు కూడా ఆనర్స్‌ను విస్తరించారు.


డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌ కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 
దోస్త్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..