Prime Minister Modi Tour In Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District)లో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)పర్యటించనున్నారు. గోరంట్ల (Gorantla)మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రం ( National Academy of Customs, Indirect Taxes and Narcotics)లో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఆరు హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాసిన్ కేంద్రంలో ప్రధాని మోడీ గంటన్నర పాటు ఉండనున్నారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతారు.
స్వాగతం పలకనున్న సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్
మోడీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకొని...అక్కడి నుంచి హెలికాప్టర్లో మొదట లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తోలుబొమ్మలాటలను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించే అవకాశం ఉంది. లేపాక్షి నుంచి హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. రోడ్డు మార్గాన పాలసముద్రంలోని నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ కేంద్రంలో భవనాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ట్రైనీ ఐఆర్ఎస్ లతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరణ
పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్–రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడనున్నారు. 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. బహిరంగసభలో మాట్లాడిన తర్వాత ఢిల్లీకి వెళతారు.
దేశంలోనే అతిపెద్ద నాసిన్ కేంద్రం
2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లే ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో...దాదాపు 15 వందల కోట్ల రూపాయలతో నాసిన్ కేంద్రంలో భవనాలు నిర్మించింది కేంద్రం. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ముస్సోరిలో శిక్షణ కేంద్రం ఉన్నట్లుగానే...ఐఆర్ఎస్ లకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది. రెండవ నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసింది. ఇండియాలోనే అతిపెద్ద నాసిన్ కేంద్రం ఇది.
హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. కానీ సత్య సాయి జిల్లాలో ఏర్పాటు చేసిన నాసిన్ కేంద్రం 503 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నాసిన్ కేంద్రంతో పాటు లేపాక్షి ఆలయాన్ని ప్రధాని భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.