స్పందించు... సహాయం అందించు... ఇది అనంతపురం జిల్లాలో గత ఐదేళ్ళ క్రితం మొదలైన హుండీ కార్యక్రమం. ఫాదర్ పెర్రర్ జయంతి రోజున ఈ కార్యకమాన్ని ప్రారంభించింది అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్.
ఐదేళ్ల క్రితం ఆర్డీటి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు జిల్లావ్యాప్తంగా లక్షా యాభైవేల కుటుంబాలకు చేరుకొంది. ప్రతి ఇంట్లోను ఏర్పాటు చేసే ఈ హుండీలో ఎవరకి తోచినంత వారు డబ్బులు వేస్తారు. సంవత్సరంపాటు ఇలా హుండీలో వేసిన డబ్బును ఫాదర్ పెర్రర్ జయంతి రోజున గ్రామ కమిటీలకు అప్పగిస్తారు. వాటిని ఆ గ్రామంలోనే తెరిచి లెక్కిస్తారు. వచ్చిన డబ్బును అంతా లెక్కించి ఆర్డీటి కేంద్ర కార్యాలయానికి చేరుస్తారు.
వీటి ద్వారా వచ్చిన డబ్బుతో ఆనాథ పిల్లలకు అవసరమైన విద్య, వైద్యంతోపాటు, వారికి అవసరమైన అన్నిసహాయ సహకారాలు అందించేందుకు ఈ ఫండ్ వినియోగిస్తున్నట్టు తెలిపారు ఆర్డీటి డైరెక్టర్ విశాల ఫెర్రర్.
ఈ హుండీ కార్యక్రమానికి నిరుపేద మహిళలతో ప్రారంభమై నేడు అన్ని వర్గాల ప్రజలకు చేరింది. ప్రజలందరూ హుండీ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఇది చాలా ఆనందదాయకం అంటున్నారు ఆర్డీటీ డైరెక్టర్ విశాల్ ఫెర్రర్. రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రారంభం సమయంలో కరవుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కానీ నేడు వాటికి భిన్నంగా ఎక్కడ ఏ విపత్తులు జరిగినా అనంత ప్రజలు సాయం చేస్తున్నారన్నారు.
కోవిడ్ సమయంలోనూ పెద్ద ఎత్తున విరాళాలు అర్డీటికి అందించారని.. విశాల హృదయం చాటుకోవడంలో అనంత ప్రజలు అగ్రగామిగా ఉన్నారన్నారు విశాల్ ఫెర్రర్. రోజుకు ఎవరికి తోచినంత అంత మొత్తం హుండీలో వేయమని చెప్పామని.. అది ఈ రోజు ఇంత ప్రోగ్రాం అవుతుందని అనుకోలేదన్నారు. ప్రతి రోజు కచ్చితంగా హుండీలో ఒక్క రూపాయి వేయాలన్న నిబంధన ఉందని.. సంవత్సరానికి ఒక్కో హుండీలో మినిమం 365 రూపాయలు వస్తుందన్నారు. ఇంకా ఎక్కవే వస్తుంది కానీ 365 రూపాయల కంటే తక్కువ మాత్రం రాదన్నారు. ఇలా కొందరు నెలకోసారి, మరికొందరు సంవత్సరానికోసారి తమ విరాళాలను అందజేస్తుంటారని తెలిపారు విశాల ఫెర్రర్.