గచ్చిబౌలిలోని ఏపీ జెమ్స్ పార్క్  స్థల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. స్థలం కబ్జాకు యత్నించారని పోలీసులు నిన్న ఓ పాతికమందిని అరెస్టు చేశారు. ఇదంతా టీజీ వెంకటేష్ మనుషులే చేయించారని కూడా ప్రచారం జరిగింది. అయితే దీన్ని స్థలం ఓనర్‌... టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు ఖండిస్తున్నారు. 


తమ స్థలాన్ని తామెందుకు కబ్జా చేస్తామంటున్నారు ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ విశ్వప్రసాద్. గచ్చిబౌలిలో స్థల వివాదంపై ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని... తాను అమెరికాలో ఉన్నట్టు తెలిపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. వంద కోట్ల స్థలాన్ని కబ్జాకు యత్నించారన్న ఆరోపణల్ని ఆయన కొట్టిపడేశారు. 


గచ్చిబౌలిలో స్థలంతో ఎంపీ టీజీ వెంకటేష్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు విశ్వ ప్రసాద్. ఆ స్థలం తమదే అంటూ ఆధారాలు చూపినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్‌, స్థలం డాక్యుమెంట్లను చూపించినా లెక్క చేయలేదని ఆరోపించారు. 


ఆ సైట్‌లో తమ కంపెనీకి చెందిన సినిమా అవుట్ డోర్ యూనిట్ టీమ్ పూజా కార్యక్రమం నిర్వహించిందని వివరించారు విశ్వప్రసాద్‌. ఈ కార్యక్రమానికి తమ ఊరి నుంచి 70 మంది వరకు వచ్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ తమ వద్ద ఉందన్నారు విశ్వప్రసాద్. వారు ఎలాంటి వెపన్స్‌ తీసుకురాలేదని వివరించారు. ఉద్దేశ పూరకంగానే ఈ ఇష్యూను రాజకీయ అంశంగా మారుస్తున్నారని విమర్శించారు. 


తాను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నానని.. దీనికి సంబంధించిన హైదరాబాద్‌ బ్రాంచ్‌లో రెండు వేల మంది, ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు వివరించారు. తనకున్న ఓ ఇన్ ఫ్రా సంస్థ ద్వారా అనేక నిర్మాణాలు, ఆఫీస్ స్పేస్ డెవలప్ మెంట్ చేస్తున్నట్టు వివరించారు.


గచ్చిబౌలిలో తమ పార్టనర్‌కు చెందిన బంధువులకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న స్థలం 2200 చదరపు అడుగులపైగా స్థలాన్ని డెవలప్‌ చేయడానికి రెడీ అయినట్టు వివరించారు విశ్వప్రసాద్. 25శాతం స్థలం కొనుగోలు చేసి, మిగతా 75శాతం స్థలాన్ని అభివృద్ధి చేసేలా అగ్రిమెంట్‌ చేసుకున్నట్టు తెలిపారు. ఆ పక్కనే ఉన్న ఏపీ జెమ్స్ పార్క్ స్థలాన్ని తీసుకున్న మెహుల్ ఛోస్కీ దేశం నుంచి పరారరయ్యారని, దాన్ని ఈడీ సీజ్‌ చేసిందని పేర్కొన్నారు. 


ఏపీ జెమ్స్ పార్క్ స్థలాన్ని ఎన్సీఎల్టీ నుంచి ఏస్ అర్బన్ డెవలపర్స్ సంస్థ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు విశ్వప్రసాద్. దాని పక్కనే ఉన్న స్థలం కూడా తమదేనంటూ వాదిస్తోందన్నారు. దీనిపై గతంలో బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయిస్తే కంప్లైంట్‌ తీసుకోలేదన్నారు. తర్వాత కోర్టును ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారన్నారు. కోర్టులో కూడా తమకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందని తెలిపారు విశ్వప్రసాద్. కోర్టులో డాక్యుమెంట్లు ఇవ్వడంలో ప్రత్యర్థులు విఫలమయ్యారన్నారు. 


కోర్టు ఆదేశాలు ఉన్నందునే ఆ స్థలంలో ఈవెంట్‌కు అనుమతి ఇచ్చామన్నారు. కానీ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకొని సాయంత్రం వరకు నిర్బంధించి తప్పుడు కేసు పెట్టారని విశ్వప్రసాద్ ఆరోపించారు. తాను అమెరికాలోని సియాటిల్‌లో ఉన్నానని ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు.