BJP On Padayatra Attack : ప్రశాంతంగా కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నేతలు దాడులు హేయమని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ యాత్రతో టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. అక్కసుతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని కొంతమంది చిల్లరగాళ్లకు మందు తాగించి పంపిస్తున్నారని ఆరోపించారు. కొందరు చెంచాగాళ్లు, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే నాయకులు అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని సోయం బాపూరావు ఘాటుగా స్పందించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ ముందే పసిగట్టారన్నారు.
ఓపికను చేతగానితనంగా భావించొద్దు
బీజేపీ కార్యకర్తలు తిరగబడితే టీఆర్ఎస్ ఉండదని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాలను బయటపెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారన్నారు. అందుకే బీజేపీ సంయమనంతో ఉందన్నారు. బీజేపీ నేతల ఓపికను చేతగానితనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నా అన్నారు. చిల్లర చేష్టలతో బీజేపీని ఏమీ చేయలేరన్నారు.
బండి పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర : రాజా సింగ్
బండి సంజయ్ పాదయాత్రపై దాడిని బీజేపీ శాసనసభా పక్షనేత రాజా సింగ్ ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్భలంతోపాటు మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడులు జరుగుతున్నాయన్నారు. పాదయాత్ర మొదలు పెట్టకముందే ఎంపీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, దాడులు చేస్తారని చెప్పారన్నారు. బీజేపీ నేతలు సంయమనంతో ఉండాలని చెప్పారన్నారు. ఈరోజు జరిగిన దాడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకు భరోసా కలిగిస్తుంటే పూర్తి భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేటు అన్నారు.
పోలీసులు కుట్రలో ఇరుక్కోవద్దు
అన్ని రంగాల్లో విఫలమైన సీఎం కేసీఆర్ ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక దాడి చేయించారని రాజా సింగ్ విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడికి రక్షణ కల్పించలేని వాళ్లు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారనే దానికి ఈ సంఘటన నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్షం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సాఫీగా కొనసాగేందుకు పూర్తి భద్రత కల్పించాలన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి.. పోతుంటాయి.. పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహించాలే తప్ప రాజకీయ కుట్రలో ఇరుక్కోవద్దని సూచించారు.