మంగళగిరి ఐజేఎం విల్లాస్‌లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఇంట్లో ఓ వ్యక్తి మూడు రోజుల కిందట చనిపోవడం రాజకీయ కలకలానికి కారణం అవుతోంది. ఆ వ్యక్తి ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారని కరెంట్ షాక్ తగిలి చనిపోయారని చెబుతున్నారు. మంగళగిరి టిప్పర్లబజార్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌   ఐజేఎం విల్లాస్‌లో ఏసీ మరమ్మతుల కోసం వెళ్లాడు. ఈ విల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందినది. అయితే ఆయన అక్కడ ఉండరు. ఆయనకు సంబంధించిన వారు ఉంటారు. ఏసీ రిపేర్ చేస్తూ షేక్ మహమ్మద్ కరెంట్ షాక్‌కు గురై పడిపోయాడని అయనను సమీపంలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు. దీంతో  విల్లాలో ఉన్న కాకాణి సంబంధీకులంతా వెళ్లిపోయారు. 
 
యువకుడి మృతి మిస్టరీగా మారింది. అసలేం జరిగిందన్నదీ తెలీడం లేదు. ఈ ఘటన శనివారం జరిగితే  ఎందుకు సీక్రెట్‌గా ఉంచారన్నది ఎవరికీ అంతుట్టకుండా ఉంది. సోమవారం ఉదయం వరకూ పోస్టు మార్టం కూడా చేయలేదు. సాధారణ ప్రమాదం అయితే విల్లాలోని వ్యక్తులు ఎందుకు హడావుడిగా వెళ్లిపోయారన్నది అనుమానాస్పదంగా మారింది. వివాదం కాకుండా ఉండటానికి మృతుడి కుటుంబీకులతో కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో రాజకీయంగా కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. 


 మృతుడు షేక్‌ మహమ్మద్‌కు తండ్రి లేరు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. మనవడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అమ్మమ్మ  మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలు్సతోంది.   తన మనువడి చేతిపై, కాలిపై గాయాలున్నాయని వృద్ధురాలు ఆమె చెబుతున్నారు.  విల్లా పైభాగంలోకి స్పృహ తప్పి పడిపోయిన మహమ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు చెబుతున్నారు.   బహుశా విద్యుత్‌ షాక్‌ లేదా షార్టుసర్క్యూట్‌ వల్ల మహమ్మద్‌ మృతి చెంది ఉండొచ్చునంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 


అయితే ఈ విల్లా కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినది కావడంతో... ఇటీవల ఆయనకు సంబంధించిన సాక్ష్యాలు నెల్లూరు కోర్టులో కొంత మంది దొంగతనం చేయడంతో దానికి.. ఈ మరణానికి లింక్ పెట్టి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాకాణి ఆ విల్లాలో ఉండరు. ఆయన మనుషులు ఉంటారు. అక్కడ ఆయన మనుషులేం చేస్తారని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో అన్ని వివరాలు చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.