Nandyal District News: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రోజు తన మన్ కీ బాత్ ప్రంసంగంలో ఏపీలోని నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన ఓ మహిళపై ప్రశంసల వెల్లువ కురిపించారు. తాటిచెర్ల విజయదుర్గ కవితను ప్రస్తావించారు. ఏటా ఐక్యతా దినోత్సవంగా జరుపుకునే సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గుల పోటీలకు దేశ వ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల గురించి మాట్లాడుతూ... ఆయన విజయ దుర్గ కవితను గుర్తు చేశారు. ఈ పోటీల్లో 700కు పైగా జిల్లాల నుంచి 24 భాషల్లో 5 లక్షల మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రధాని మోదీ వివరించారు. వారందరికీ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరిలోనూ ఒక ఛాంపియన్ ఉన్నారని వెల్లడించారు. దేశ వైవిధ్యం, సంస్కృతిపై ప్రేమను ప్రదర్శించారన్నారు.
దేశభక్తి గీతాల పోటీలో విజేతగా విజయదుర్గ..
ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లాకు చెందిన బీఎం మంజునాథ్ కన్నడలో, అస్సాంలోని కామరూప్ జిల్లాకు చెందిన దినోష్ గోవాలా అస్సామీలో రాసి లాలి పాటలను ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశభక్తి గీతాల పోటీలో విజేతగా నిలిచిన గృహిణి, కవయిత్రి విజయదుర్గ పేరు ఉటంకిస్తూ... ఆమె రాసిన కవితా పంక్తులను చదివారు. తన ప్రాంతంలోని తొలితరం స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నుంచి ఆమె ప్రేరణ పొందారని అభినందించారు. మైథిలీ భాషలో రాసిన దేశభక్తి, కవితను ప్రస్తావించారు. పోటీకి వచ్చిన ఎంట్రీలను కేంద్ర సాంస్కృతిక శాఖ తన వెబ్ సైట్ లో పెట్టింది. అవేంటో తెలుసుకోవాలనుకుంటే ఓసారి వెబ్ సైట్ ఓపెన్ చూసి చూడండి.
విజయదుర్గ రాసిన గీతం..
రేనాటి సూర్యుడూ.. వీరనరసింహుడా...
భారత స్వాతంత్ర్య సమరపు అంకురానివి నీవురా..
అంకుశానివి నీవురా..
తెల్లదొరల నీతిలేని నిరంకుశపు దమనకాండకు..
సలసలమని మరిగిననీ నెత్తుటి ఎర్రని కాకలు..
రేనాటి సూర్యుడా.. వీరనసింహుడా..