Kurnool Crime News: రెండు రోజుల కిందట హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే ఏపీలో అలాంటి ఘటనే జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వ్యాయామం చేసేందుకు జిమ్ కు వెళ్లాడు. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో అక్కడ కళ్లు తిరిగినట్లు అనిపించగా కొంత సమయానికే జిమ్ నుంచి బయటకు వచ్చేశాడు. అలా రాగానే ఆయనకు మూర్ఛ వచ్చింది. విషయం గుర్తించిన స్థానికులు సపర్యలు చేయగా.. స్పృహలోకి వచ్చాడు. ఈ క్రమంలో కార్డియాక్ అరెస్ట్ అయి కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.  


అసలేం జరిగిందంటే..?


కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 28 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి వద్దే ఉంటున్నారు. అతనికి ఇటీవల వివాహం కూడా నిశ్చయం అయింది. వ్యాయామం చేయడానికి శనివారం ఉదయం పట్టణంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధాన రహదారిపై ఉన్న జిమ్ కు ఆయన వెళ్లారు. వర్కౌట్స్ చేస్తుండగా కొద్దిసేపటికే కళ్లు తిరగడంతో స్నేహితుడితో కలిసి బయటకు వచ్చారు. స్నేహితుడు వాటర్ బాటిల్ తేవడానికి వెళ్లగా అంతలోనే యువకుడికి మూర్ఛ వచ్చింది. విషయం గుర్తించిన స్థానికులు సపర్యలు చేశారు. అయితే కాసేపటికి మెలకువ వచ్చినా కొంత సేపటికే మళ్లీ కుప్పకూలిపోయాడు. అక్కడికి చేరుకున్న స్నేహితుడు వెంటనే ఆటోలో ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి యువకుడిని తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు యువకుడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. యువకుడి పేరు వెల్లడించేందుకు బాధిత కుటుంబీకులు నిరాకరించారు. 


కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ పోలీస్


హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. రెండు రోజుల కిందట నడి రోడ్డుపైనే ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికాగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సు దిగిన బాలాజీ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఆరంఘర్ చౌరస్తాలో దిగగానే బాలాజీ గుండెపోటుతో కుప్పకూలాడు. అతణ్ని గమనించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేశారు. ఛాతీపై గట్టిగా పదే పదే ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని రాజశేఖర్ కాపాడారు. అనంతరం బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ఇటీవల ఒక్కరోజే హైదరాబాద్ నాలుగు కార్డియాక్ అరెస్ట్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 23న పాత బస్తీలో ఓ పెళ్లి వేడుకలో వరుడిని రెడీ చేస్తుండగా ఓ వ్యక్తి  కుప్పకూలిపోయాడు. కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని వరుడిని ముస్తాబు చేస్తున్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన బంధువులు ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. 


రబ్బాని మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.