కర్నూలు జిల్లాలో ఓ నవ వధువు చేసిన పని ఓ ఇల్లు కాలబెట్టే వరకూ వెళ్లింది. పెళ్లి జరిగిన మూడు రోజులకే అంతకుముందు ప్రేమించిన వ్యక్తితో యువతి వెళ్లిపోయింది. ఇదే వివాదానికి దారి తీసి ఇంటికి నిప్పంటించే వరకూ వెళ్లింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు యువతి ప్రేమికుడి ఇంటిని తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఈ ఘటన ఆదివారం జరిగింది.


కర్నూలు జిల్లా మాధవరం గ్రామానికి యువతితో ఈ నెల 9న సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అంతకుముందే ఆమె మాధవరానికి చెందిన శివాజీ అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ, పెద్దల ఒత్తిడి మేరకు వారు నిర్ణయించిన అబ్బాయిన పెళ్లి చేసుకుంది. దీంతో పెళ్లయిన మూడో రోజున శివాజీ ఆమెను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇది తెలుసుకున్న వధూవరుల బంధువులు ఆగ్రహంతో ఆదివారం రాత్రి శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. పోలీసులు సమాచారం అందుకొని చుట్టుపక్కల వారితో కలిపి మంటలు ఆర్పేశారు. 


అయితే, శ్రీజ, శివాజీ ప్రేమించుకుంటున్నారని కుటుంబ సభ్యులకు ముందే తెలియడంతో వారిని విడగొట్టేందుకు తల్లిదండ్రులు ఈమెకు పెళ్లి చేశారని స్థానికులు చెప్పారు. ఆ క్రమంలోనే రచ్చమర్రికి చెందిన భీమ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి ఇష్టం లేని శ్రీజ తన ప్రియుడు శివాజీతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో శ్రీజ కుటుంబం శివాజీ కుటుంబంపై ఆగ్రహం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు శివాజీ ఇంటిపై శ్రీజ కుటుంబసభ్యులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో శివాజీ ఇంటిలోని దాచుకున్న పంట ధ్యాన్యం, బట్టలు, ఇతర సామగ్రి మొత్తం కాలిపోయాయి. 


దీంతో మాధవరంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. అయితే, తమపై శ్రీజ బంధువులు దాడి చేస్తారనే భయంతో శివాజీ కుటుంబ సభ్యులు పారిపోయినట్లుగా స్థానికులు వెల్లడించారు.