Kojjepalli Village: కొంచెం పాతతరం పేర్లు పెడితే పిల్లలు ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. సుబ్రహ్మణ్యం అనే పేరు పెడితే సుభాష్ గాను, రామారావు, రామయ్య అంటే రామ్స్ గాను తమ పేర్లను మార్చుకుంటున్న ఎంతోమందిని చూస్తుంటాం. మీరు పెట్టిన పేరు వల్లే సరిగ్గా చదవలేక పోవడానికి  సగం కారణం అంటూ ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. అలాంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఒక గ్రామం పేరు కొజ్జేపల్లి. దీంతో గ్రామస్తుల మానసిక వేదన వర్ణనాతీతం. తమ గ్రామం పేరు మార్చండి అంటూ ఎక్కని ఆఫీసు గడపలేదు. మొక్కని ప్రజా ప్రతినిధి లేడు. ఎన్నో అగచాట్లు పడ్డ తర్వాత ఊరు పేరు రికార్డులలో అయితే గాంధీనగర్ గా మారింది. గానీ వ్యవహారంలో కొజ్జేపల్లి గానే మిగిలిపోయింది.


ఆ కథేంటో తెలుసా.. 
గుత్తి పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి కొజ్జేపల్లి అనే పేరు రావడానికి రెండు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం ఈ గ్రామంపై మరొక గ్రామం ప్రజలు ఏదో ఒక కారణం వల్ల దాడికి రాగా.. గ్రామస్తులు ఊరు వదిలి దూరంగా వెళ్లి పెద్ద పెద్ద రాతి బండల చాటున దాక్కున్నారట. అందుకే కొజ్జేపల్లి అనే పేరు వచ్చిందనేది ఒక కథ చెబుతారు.


గుత్తి చెరువు సమీపంలో పూర్వం కొంతమంది హిజ్రాలు పూరి గుడిసెలు వేసుకుని నివసించేవారని అందుకే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చిందని మరో కథ సైతం స్థానికుల నోట వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి ఆ గ్రామ యువత మాత్రం ఊరి పేరు వల్ల తమకు అవమాన భారం గా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్లినా , బస్సులలో టికెట్లు తీసుకునే సమయంలో, స్నేహితులకు తమ ఊరి పేరు చెప్పాలన్నా ఎంతో మానసిక వేదనకు ఈ గ్రామస్తులు గురవుతున్నారు.


పలువురు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ బాధను గ్రామస్తులు చెప్పుకోవడంతో ఊరు పేరైతే అయితే గాంధీనగర్ గా మార్పు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కానీ వ్యవహారాలలో మాత్రం కొజ్జేపల్లి అని చెబితే గాని ఊరును గుర్తుపట్టని పరిస్థితి ఉంది. కనీసం ఉత్తరాలు ఊరికి చేరాలంటే గాంధీ నగర్ తో పాటు కొజ్జేపల్లి అని రాయాల్సి రావడం ఇప్పటికీ ఆ గ్రామస్తులను వేధిస్తున్న అంశం. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఊరు పేరు మార్పును భారీగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని విద్యావంతులైన ఆ గ్రామ యువత భావిస్తున్నారు. 
Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన  
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి