Kadapa News: సీఎం సొంత జిల్లా కడపలో దారుణం చోటు చేసుకుంది. బీ మఠం తహసీల్దార్ కిషోర్ రెడ్డిని స్థానిక జడ్పీటీసీ రామగోవింద రెడ్డి బెదిరించారు. తన అనుచర వర్గంతో కలిసి నేరుగా ఎమ్మార్వో కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అధికారంలో ఉంది.. వైసీపీ పార్టీ అని గుర్తుంచుకోవాలంటూ ఎమ్మార్వోపై గట్టి గట్టిగా అరిచారు. తాము చెప్పినట్లు వినకపోతే వెళ్లిపోతారని.. పరుష పదజాలంతో జడ్పిటీసీని బెదిరించారు. బెదిరింపులకు పాల్పడ్డ జడ్పీటీసీపై, అతని అనుచరులపై తహసీల్దార్ కిషోర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.


తహసీల్దార్ కిషోర్ రెడ్డి ఏమన్నారంటే.. "నేను ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది. వచ్చినప్పటి నుంచి అసైన్ మెంట్ కమిటీకి సంబంధించి వెరిఫికేషన్ ఎక్కువగా ఉంది. ఈరోజు కూడా అసైన్ మెంట్ వెరిఫికేషన్ కు సంబంధించి ఓ మీటింగ్ కు హాజరవడం జరిగింది. నేను వెరిఫికేషన్ చేసుకుంటుండగా.. జడ్పీటీసీ రామగోవింద రెడ్డి వచ్చారు. అసైన్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనే వచ్చారు. వచ్చిన తర్వాత అసైన్ మెంట్ విషయంలో వారు అడిగిన కొన్నింటి గురించి నేను తెలియజేశాను. ఆ తర్వాత ఆఫీస్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి.. అందరూ ఉండగానే నేను డొనేషన్ అడిగాను. దీనిమీద ఓ వ్యక్తి మీరు తీసుకునే డబ్బుల్లో లక్షలు లక్షలు లంచాలు తీసుకుంటున్నారు కదా దానితోనే కట్టుకోండని చెప్పాడు. దానికి అంత మంది గ్రూప్ గా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అన్నందుకు ఈ గొడవ. దాని తర్వాత ఈ గొడవకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ గొడవపై ఇప్పటికే నేను ఆర్డీఓకు ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఉత్తర్వుల మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాను’ అని స్పష్టం చేశారు.


సొంత పార్టీ నేతలపై వైసీపీలో మరో ఎమ్మెల్యే ఆగ్రహం


నెల్లూరులో రాజకీయాలు ఇప్పుడంతా వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు సాధించినా కూడా పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. తాజాగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.. సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు పెట్టారని, అలా పెట్టినవారికి సొంత పార్టీ నేతలు మద్దతు తెలపడం సరికాదని అంటున్నారాయన. ఆయన ఆవేదన ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న సమస్యలు చాలవన్నట్టు... ఇప్పుడు మరో ఎమ్మెల్యే పార్టీలో కలకలం రేపే వ్యాఖ్యలు చేయడం విశేషం. 


అసలేం జరిగింది..?
మంగపల్లి జ్యోతిష్‌ కుమార్‌రెడ్డి అలియాస్ బాబురెడ్డి అనే వ్యక్తి సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగి. కిలివేటి సంజీవయ్యే అతడికి ఉద్యోగం ఇప్పించారని అంటారు. అతడు శ్రీహరికోటకు చెందినవాడు. వైసీపీలో చురుకైన కార్యకర్త, కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధిస్తూ పోస్టింగ్ లు పెడుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవల బాబు రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గొడవ మొదలైంది.