ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళ పల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సీఎం జగన్ తో పాటుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సజ్జన్ జిందాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గురించి మాట్లాడారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రులు అని గుర్తు చేసుకున్నారు. అలా సీఎం జగన్‌తో తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన బాటలోనే సీఎం జగన్‌ ఇప్పుడు నడుస్తున్నారని చెప్పారు.


తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినప్పుడు వైఎస్‌ జగన్‌ యువకుడని గుర్తు చేసుకున్నారు. ఆయన్ను ముంబయికి తీసుకెళ్లి వ్యాపార సూత్రాలు నేర్పించాలని వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి తనతో చెప్పారని అన్నారు. 15-17 ఏళ్ల క్రితం జగన్‌ ముంబయిలోని తన ఆఫీస్‌కు కూడా వచ్చారని చెప్పారు. ‘‘ఇప్పుడు ఏపీని సీఎం జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా జగన్‌ భావిస్తున్నారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్‌ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నాం. వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్‌ వరకూ ఆయన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. నాకు తెలుగు మాట్లాడటం రాదు లేదంటే నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా మీకు అర్థమయ్యేవి. సీఎం జగన్‌ లాంటి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని సజ్జన్‌ జిందాల్‌ సీఎంను ఉద్దేశించి కొనియాడారు.


రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ కడప ప్రజల చిరకాల స్వప్నం అని అన్నారు. వైఎస్‌ జగన్‌ కృషి, పట్టుదల కారణంగానే ఈ కల సాకారం అవుతోందని అన్నారు. ఇది వైఎస్సార్‌ జిల్లా. మహానేత వైఎస్సార్‌ని స్మరించుకోకపోతే ఈ కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోతుందని సజ్జన్‌ జిందాల్‌ ప్రసంగించారు. 


అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో దేవుడి దయతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ అనేది ఎప్పటి నుంచో కలలుగన్న కల అని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాతి నుంచి ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టింకోలేదని విమర్శించారు.


రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్లాంటుకి సకల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం తరపున దాదాపు రూ.700 కోట్ల ఖర్చుతో మౌలిక వసతుల సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ మొదటి దశ పూర్తవుతుందని అన్నారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో చుట్టుపక్క అనుబంధాల రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చదువుకున్న మన కుటుంబాల పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి లభిస్తుందని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం కూడా తెచ్చామని అని సీఎం జగన్‌ అన్నారు.