Chalal Familu Disupte :  ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభావితమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా ఉన్న చల్లా ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వీధిన పడ్డాయి. చల్లా రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా ఇటీవల చనిపోయారు. దాంతో ఆ కుటుంబంలో వారసత్వ సమస్యలు వచ్చాయి. అవుకు పట్టణంలో ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఇంట్లో కుటుంబసభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ దృస్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  రూ.5 లక్షల విలువ చేసే చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి సంబంధించిన వ్యవహారం చివరకు ఘర్షణకు దారితీసినట్లుగా చెబుతున్నారు. 


చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు మరణంతో  కుటుంబంలో గొడవలు


చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడు చల్లా భగీరథరెడ్డి మరణం తర్వాత రాజకీయ ఆధిపత్యం కోసం చల్లా కుటుంబ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్‌ రెడ్డి, రెండో కుమారుడు భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి చల్లా ఇంటి సమీపంలోనే ఎదురెదురుగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. గురువారం రాత్రి ఇంట్లోనే చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం కోసం ఇరవర్గాల వారు గొడవ పడ్డారు. ఆ సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవిని కోడలు శ్రీలక్ష్మి తీవ్ర పదజాలంతో దూషించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్రీదేవికి క్షమాపణ చెప్పాలని శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో శ్రీలక్ష్మి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. 


రెండు వైసీపీ ఆఫీసులు ప్రారంభించి రాజకీయాలు                         


విఘ్నేశ్వర్‌ రెడ్డి తల్లి శ్రీదేవి, చెల్లెళ్లు బృంద, పృథ్వీ కలిసి శ్రీలక్ష్మి కార్యాలయంలో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఇంట్లో ఉన్న శ్రీలక్ష్మి ఈ విషయం తెలుసుకుని తన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏమిటని లోనికి వచ్చి విఘ్నేశ్వర్‌ రెడ్డిపై ఓ టీవీ చానల్  లోగోను విసిరారు. దీంతో చల్లా కుటుంబంలోని ఇరు వర్గాల మహిళలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో రామకృష్ణారెడ్డి అక్క కుమారుడు రవీంద్రనాఽథ్‌ రెడ్డి కాలితో తన్నినట్లు శ్రీలక్ష్మి ఆరోపించారు. అనంతరం శ్రీలక్ష్మి వర్గానికి చెందిన సాయిచరణ్‌ రెడ్డి, చైతన్య రెడ్డి శ్రీలక్ష్మి కార్యాలయం వద్దకు రాగా మరోసారి ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు.  


వైసీపీ కీలక నేతలు వచ్చి రాజీకీ చేసే ప్రయత్నం                  


కడప జిల్లా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అవుకుకు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు.  విఘ్నేశ్వర్‌ రెడ్డి, శ్రీలక్ష్మి వర్గాలపై కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న చల్లా ఫ్యామిలీ   ఇలా రోడ్డెక్కి ఘర్షణ పడటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. చల్లా రామకృష్ణారెడ్డి చనిపోయినప్పుడు ఆయన కుమారుడు భగీరథ్  రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని జగన్ చెప్పారు . కానీ కుటుబంలో గొడవల కారణంగా ఆయన ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు.