రోజు రోజుకి చేనేత ముడిసరుకుల ధరలు రాకెట్ స్పీడ్ తో పైకి వెళ్తున్నాయి. చేనేత ఉత్పత్తుల ధరలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. దీంతో గిట్టుబాటు కాకపోవడంతో చేనేత వృత్తిని వీడేందుకు నేతన్నలు సిద్ధమవుతున్నారు. తమ తర్వాతి తరాలను ఎట్టి పరిస్థితులలో ఈ వృత్తికి దూరంగా పెంచేందుకే నిర్ణయించుకున్నట్టు తెగేసి చెబుతున్నారు. కిలో పట్టు ధర రూ.3,500 నుంచి రూ.7 వేలకి చేరిందని అంటున్నారు. ఇది కూడా కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు వంద శాతం ధర పెరగడం ఆశ్చర్యకరమని నేతన్నలు చెబుతున్నారు.  


వివిధ కారణాల వల్ల ధరలు పెరిగాయా? లేక దళారీలు తమ ఇష్టారాజ్యంగా పెంచారా? అన్న విషయం కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆందోళన కలిగించే విషయమని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అధికంగా చేయడం మరింత ఆందోళనకరమని నేతన్నలు విచారం వ్యక్తం చేస్తున్నారు.


జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మంది చేనేత వర్గానికి సంబంధించిన జనాభా ఉంది. వేలాదిగా చేనేత మగ్గాలు ఉన్నాయి. అయితే ధరలు పెరిగిపోవడం, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూసిన నేతన్నలు చేనేత మగ్గాలను తీసేస్తున్నారు.  ఇతర వృత్తులపై దృష్టిసారించి అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి చేనేతకి పోటీగా పవర్ లూమ్స్ రావడంతో చేనేత పరిశ్రమ మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిందని చేనేతలు చెబుతున్నారు. ప్రభుత్వాలు తమకు కూడా పవర్లూమ్స్ ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి తమ వర్గాలను ఆదుకోవాలని కోరుతున్నారు.


ఒక్కఅనంతపురం జిల్లాలోనే దాదాపుగా 5 లక్షల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే, వీరిలో చాలా మంది ఇప్పటికే ఈ వృత్తి నుంచి దూరం అవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత తరం వారు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతుండగా, కొత్త తరం వారు హ్యాండ్లూమ్స్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఓ వైపు పవర్ లూమ్స్, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ముడి సరకుల ధరలతో మరింత ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు చేనేత కార్మికులు.


ఇప్పటికే తెలంగాణలో అక్కడి నేతల చేనేత ముడిసరుకుల ధరలపై జీఎస్టీ లేకుండా చూడాలంటూ కేంద్రానికి విజ్ణప్తి చేయగా, ఇక్కడ ఏపీలో కూడా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ముడి సరకులకు జీఎస్టీని తొలగించాలంటూ విన్నవించారు. అనంతపురంలో నాసిన్ భూమిపూజకు వచ్చిన కేంద్రమంత్రికి స్థానిక నేతలు కూడా ఇదే వినతి పత్రం ఇచ్చారు. కానీ ఆర్థిక మంత్రి ఏ మాత్రం స్పందించలేదు. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమ మరింతగా దిగజారే పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు చేనేత కార్మికులు. ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయనేదానిపై ఆశగా ఎదురు చూస్తున్నారు.