రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. కర్నూలు నగరంలోని తిలక్ నగర్ కాలనీకి చెందిన రవితేజ (24) అనే యువకుడు పాల్పడ్డాడు. అతను వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను ఎంతగానో అభిమానించే హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా తనకు నచ్చలేదనే కారణంతోనే రవితేజ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అతని తల్లి కూడా ఈ విధంగానే ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం మరో ఊరికి వెళ్లిన అతని తల్లి.. రవితేజకు ఫోన్ చేస్తే చాలా సార్లు లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె రవితేజ స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు ఉదయం రవితేజ ఇంటికి వెళ్లి తలుపు తట్టినా స్పందించ లేదు. వెల్డింగ్ యంత్రంతో ఘడియను తొలగించి చూడగా ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే అతణ్ని కిందకి దింపి బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి రవితేజ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 


ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాగా లేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నట్లుగా మృతుడి తల్లి ఫిర్యాదు ఇచ్చింది. దీంతో బంధువులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు బలవన్మరనానికి పాల్పడటంతో తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది.


‘పుష్ప’ను దాటేసిన రాధేశ్యామ్
‘రాధే శ్యామ్’ సినిమా మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.79 కోట్లు వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. బాక్సాఫీస్ ను రాధే శ్యామ్ శాసిస్తోందని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత తమ చిత్రాన్ని హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది. తొలి రోజు వసూళ్లలో అల్లు అర్జున్ చిత్రం పుష్పను రాధే శ్యామ్ దాటేసింది. తొలి రోజున పుష్ప రూ.71 కోట్లు వసూలు చేసింది. పుష్ప చిత్రానికి కూడా తొలి రోజున మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా రూ.330 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే తరహాలో రాధే శ్యామ్ కూడా భారీ వసూళ్లను రాబడుతుందేమో వేచి చూడాలి.