అనంతపురం రైతుల కష్టాలు వర్ణనాతీతం. ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు. జిల్లాలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు. వేరుశనగతో మొదలపెడితే...పప్పుశనగ, మిరప, పత్తి, ఉద్యానపంటలు ఇలా ఏ రైతును తీసుకున్న వారి బాధలు వింటే చలించిపోక తప్పదు. అధికారులు మాత్రం అంతా బాగుంది అన్నరిపోర్టులు ప్రభుత్వానికి పంపడంతోనే రైతులను తీవ్రంగా నాశనం చేస్తున్నారు. వేరుశనగ పంటను తీసుకొంటే నాలుగ లక్షల హెక్టార్లకుపైగా సాగు చేస్తే కేవలం పదివేల ఎకరాల్లో మాత్రమే పంట దెబ్బతింది అని ఈ క్రాప్ బుకింగ్‌లో నమోదు చేస్తారు. అంటే మిగిలిన పంట బాగుందా అంటే సమాధానం ఉండదు. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు మిగిలిన రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో. 


పప్పు శనగ రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. లక్షా ముప్పై ఎనిమిది వేల ఎకరాల పంటను సాగు చేయగా... ఒక్క ఎకరా కూడా పంట మిగిలింది లేదు. వేసింది వేసినట్లే పంట పోయింది. కొందరైతే రెండోసారి కూడా పంటను సాగు చేశారు. కానీ అదికూడా అలాగే పోయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా రైతుల దగ్గరకు వెళ్లి పరిస్థితి గురించి అడిగింది లేదు. ముఖ్యంగా రెండోసారి వర్షాలు , వరదలు రావడంతో మొదటిసారి పప్పుశనగను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం మళ్ళీ పప్పుశగన విత్తనాలు అందిస్తోంది. అది కూడా సీజన్ అయిపోతున్న టైంలో ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తోందని రైతులు వాపోతున్నార.


జిల్లాలో నల్లరేగడి నేలలో సాగయ్యే పప్పుశనగ రైతులకు మళ్ళీ విత్తనాలు అందించడం ద్వారా పంటను సాగు చేయమని చెప్తుంది. కానీ పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు వచ్చే అవకాశాలు వుండవు. అందుకే అనంతపురం జిల్లా రైతులు ప్రకృతి పెట్టే విషమ పరీక్షలను తట్టుకోలేకపోతున్నారు.


మిరప రైతులది కూడా ఇదే పరిస్థితి. జిల్లాలో సాగయ్యే బ్యాడిగ మిర్చికి మంచి రేటు ఉంది. కానీ జిల్లాలో పంట మొత్తం పోయింది. ఉరవకొండ, తాడిపత్రి ప్రాంతాల్లో మిరప సాగు చేస్తారు. మొన్న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయింది. అందుకే జిల్లాలో విపక్షాలన్నీ పంట నష్ట పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం స్పందించండం లేదు. కేవలం మేమున్నామని.. ధైర్యంగా ఉండమని చెప్తున్నారే కానీ ఎక్కడా ఇంత సహాయం చేస్తామని చెప్పడం లేదు. మరోవైపు వామపక్షాలు... ప్రతిపక్ష టిడిపి నేతలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నప్పటికి ఏమాత్రం చలనం లేదు.


వేరుశనగ, పప్పుశనగ రైతులకు ఎకరాకు ఇరవైఐదువేలు ఇవ్వాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను అంచనా వేసి నష్టపోయన దానిలో కనీసం యాబై శాతమైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క వేరుశనగ పంటను సాగు చేసే సమయంలో ఒక్క బ్యాంక్‌ల నుంచే రైతులు నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, వాటన్నిటిని మాఫీ  చేయాలని పాదయాత్ర చేస్తున్న సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, వాటిని చూస్తూ నడుస్తున్న తమకు రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుస్తున్నాయని... ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


గ్రామంలో ఉన్న ఆర్బీకే సిబ్బంది ఏం చేస్తున్నారని... ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు సీపీఎం నేతలు. కేవలం అదికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు వాస్తవాలు దాస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి  తీవ్రంగా నష్టపోయిన అనంతపురం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.