Diamond in farmer land in Kurnool: ఎవరి జీవితం ఎప్పడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కుబేరులైన వాళ్లు ఎందరో ఉన్నారు. కుబేరుడయ్యేంత స్థాయిలో కాకపోయినా ఎన్నో పంటలు పండించినా లభించనంత ఆదాయం చిన్నపాటి వజ్రం దొరకడంతో ఒక రైతుకు సమకూరింది. రాత్రికి రాత్రే లక్షల రూపాయలు లభించేంత అదృష్టం కర్నూలు జిల్లాలోని ఓ రైతును వరించింది.


రోజంతా వ్యవసాయం చేసే తన పొలంలో వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే ఆ రైతు ఆర్థిక కష్టాలు చాలా వరకు తొలగిపోయాయి. ఈ మధ్య కురిసిన వర్షాలకు రైతు పొలంలో ఆ వజ్రం బయటపడింది. రైతు రోజూ మాదిరిగానే పొలంలో పనులు చేసుకుంటుండగా, ఆ వజ్రం రైతు కంట పడింది. ఇంటికి తీసుకెళ్లి రైతు ఆ వజ్రాన్ని భద్రపరిచాడు. అయితే, రైతుకు వజ్రం దొరికిన విషయం పలువురు వ్యాపారులకు తెలియగా.. ఆయన ఇంటి వద్దకు క్యూ కట్టారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. వ్యాపారుల మధ్య పోటీ అధికంగా ఉండడంతో వజ్రాన్ని విక్రయించేందుకు వేలం పాట పెట్టారు. పెరవల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఈ వజ్రం కోసం ఐదు లక్షల నగదు, రెండు తులాల బంగారిన్ని ఇచ్చి దక్కించుకున్నాడు. 


పది లక్షలుపైనే ధర


రైతుకు దొరికిన వజ్రం ధర బయటి మార్కెట్‌లో పది లక్షలుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ, వ్యాపారులు ఆ స్థాయిలో కొనుగోలు చేయలేదు. ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి భూముల్లో వెతుకుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా భూమిని బాడుగుకు తీసుకుని, కూలీలను పెట్టి మరీ వెతికిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం విలువైన వజ్రం దొరికితే జీవితమే మారిపోతుందన్న భావన. తాజాగా దొరికిన వజ్రం హంప అనే గ్రామానికి చెందిన రైతుకు దొరికినట్టు చెబుతున్నారు.