Thopudurthi Prakash Reddy Predicts YSRCP wins AP Assembly Elections 2024: అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడే అది వైసీపీ వైపే ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పందెం కోళ్లు ప్రజా తీర్పును జూదంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరగలేదని, విశ్వసనీయత.. మోసానికి మధ్య జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో అంతిమ విజయం విశ్వసనీయతదే. ప్రజలు వైసీపీ పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేశారు.
164 సీట్లు గెలవబోతున్నాం..
‘అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లూ గెలవబోతున్నాం. హిందూపురంలో బాలకృష్ణ కూడా జెండా పీకేసి చాప చుట్టేశారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌కళ్యాణ్ ఓడిపోతున్నారు. 164 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. కేవలం 4 సీట్లకు మాత్రమే చంద్రబాబు పరిమితం కాబోతున్నాడు. బీజేపీ, జనసేన 7 సీట్లలో గెలవబోతోందని’ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెర తీశారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతోందంటూ ఐప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టి చోటామోటా నాయకులకు ఆశలు కల్పించి వారితో అప్పులు చేయించి పందెలు కట్టేలా చేయిస్తున్నారు. వైసీపీ తరపున పందేలు కడుతోంది కూడా ఓడిపోతున్న ఆ పార్టీ అభ్యర్థులే. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకునేందుకు వారే పందెం వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తూ పాము తన గుడ్లును తానే మింగినట్లు టీడీపీ తమ కార్యకర్తల సొమ్మును కాజేసేందుకు వారి అభ్యర్థులు కుట్ర పన్నారని’ ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్ అమలు చేసిన పథకాల గురించి చెప్పి వైఎస్సార్‌సిపి అభ్యర్థులు ఓట్లు అడిగారని, అన్నం పెట్టిన జగనన్నను గెలిపించమని ఓట్లు అడిగామన్నారు. మరి తెలుగుదేశం పార్టి అభ్యర్థులు మమ్మల్ని తిడుతూ ఓట్లు అడిగారు. మేం అధికారంలోకి వస్తే వారిని తొక్కుతాం, వీరిని తొక్కుతాం అంటూ వీరంగాలు చేస్తూ ప్రచారం మమ అనిపించారని ఎద్దేవా చేశారు. కనీసం చంద్రబాబు ఎజెండా కాని, సూపర్ సిక్స్ గురించి మాట్లాడే దైర్యం కూడా చేయలేదని, చంద్రబాబు ఒక పెద్ద మోసగాడు అని ప్రజలకు తెలుసునన్నారు. పైగా పథకాలేమీ లేవు అమరావతిలో పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో కూడా వైరల్ అయినట్లు రాప్తాడు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
‘సంక్షేమ పథకాలకు మద్దతుగా, ప్రభుత్వం చేసిన సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో జగనన్న ప్రభంజనం నడిచింది. చరిత్ర సృష్టించబోతున్నాం. జగన్ వైనాట్ 175 అనేది అంత ఆషామాషీగా చెప్పలేదు. అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకునే మాట్లాడాడు. మోసం, కుట్ర, మేనేజ్‌మెంట్‌తోనే ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలమనే బీజేపీతోనే జత కట్టాడు. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమకు నచ్చిన అధికారులను ఎన్నికల్లో వేయించుకున్నారు. వారు ఎక్కడైతే అధికారులను వేసుకున్నారో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి. గెలుస్తామనే ఆశ చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. అందుకోసమే ప్రతి జిల్లాలోనూ సీట్లు అమ్ముకున్నాడు. 4వ తేది వరకు వస్తున్నాం.. వస్తున్నాం అంటూ ఎంజాయ్ చేయండి. కల కనండి. ఆ కలలోనే బతకండి. జూన్ 4న మధ్యాహ్నం 12 గంటలకు నేలమీదకు దిగిరండి. అప్పుడు వాస్తవంలో జగన్ గెలవబోతున్నాడని’ తోపుదుర్తి వ్యాఖ్యానించారు.