Posani Krishna Murali: అన్నమయ్య జిల్లా : టాలీవుడ్ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పై కేసు నమోదైంది. దాంతో నరసరావుపేట టూ టౌన్ పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు. తాజా కేసులో భాగంగా పీటీ వారెంట్ పై పోసానిని నరసరావుపేటకు తరలించే యత్నాలు మొదలయ్యాయి. నరసరావుపేట సిఐ హైమారావు, సిబ్బంది రాజంపేట సబ్ జైలుకు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Continues below advertisement


ప్రస్తుతం పోసాని రాజంపేటలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై నరసరావు పేట పోలీసులు 153-ఎ, 504, 67 ఐటీ కింద తాజాగా కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసరావుపేటకు పోసానిని తరలించి, అక్కడ న్యాయస్థానం ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. 


పోసానిపై ఏపీ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు


నటుడు పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు కాగా ఆ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు ఆయనపై పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట సబ్ జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అనంతపురం రూరల్, గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా పోలీసులు పోసానికి సంబంధించి పీటీ వారెంట్లు రాజంపేట జైలుకు సమర్పించారు. పోసానిని తమ అదుపులోకి తీసుకునేందుకు నరసరావు పేట పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నామని చెబుతున్నారు. కనుక పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు విషయం తెలిపారు.


నరసరావు పేట పోలీసులకు పోసాని అప్పగింత


ఒకేసారి మూడు జిల్లాల పోలీసుల నుంచి పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్దత నెలకొంది. మరోవైపు పోసానిని నరసరావు పేటకు తరలించేందుకు ఆ పోలీసులు వాహనాలు రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలు పరిశీలించిన రాజంపేట జైలు అధికారులు పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. అటు నుంచి పోసానిని నరసరావుకు తరలించనున్నారు.  రెండు రోజుల కిందట చేసినట్లు నేడు సైతం ఛాతీలో నొప్పిగా అనిపిస్తుందని పోసాని పోలీసులకు చెప్పారు. దాంతో వారు డాక్టర్లను రప్పించి రాజంపేట సబ్ జైలులో పోసానికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మెడికల్ టెస్టుల అనంతరం పోసానిని గుంటూరు జిల్లా నరసరావుపేటకు తరలించనున్నారు.


Also Read: MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్