Kurnool Holi Celebrations : హోలీ పండుగ అంటే రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపే పండుగ. అయితే హోలీ పండుగను ఒక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో హోలీని వింత ఆచారంతో జరుపుకుంటారు. రతీమన్మథులకు మొక్కుకుని ఆ కోరికలు తీరితే మగవారు మహిళల వేషధారణ ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఏడాది హోలీ రోజున ఈ ఊరి మగవారు మగువ వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామానికి జనం తరలివస్తుంటారు.
మగవారు మగువల్లా మారి పూజలు
హోలీ పండుగ వస్తే ఆ ఊరు వార్తల్లో నిలుస్తుంది. మగవారు(Men) మగువల్లా(Women Attire) సింగారించుకుని పూజలకు సిద్ధపడటమే ఇందుకు కారణం. కర్నూలు జిల్లా(Kurnool District) ఆదోని మండలం సంతెకుడ్లూరు(Santekudluru) గ్రామంలో తరతరాలుగా ఈ ఆచారం పాటిస్తున్నారు. కోరిన కోర్కెలు తీరితే పురుషులు చీర కుట్టుకుని, పూలు పెట్టుకుని అలంకరించుకుని మొక్కులు తీర్చుకుంటారు. కంఠాభరణాలు ధరిస్తారు. స్త్రీ వేషధారణలో ఆలయానికి వెళ్లి రతీమన్మథులకు పూజలు చేస్తారు. పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలో ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. నిరక్షరాస్యులతోపాటు ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడిన సంపన్నులు కూడా స్త్రీ వేషధారణలో పూజల్లో పాల్గొంటారు. మగవారు ఆడవాళ్లగా అలంకరించుకొని పూజలు చేయడం తమ గ్రామం ప్రత్యేకత అని, ఇది దైవకార్యంగా భావిస్తామని గ్రామస్థులు తెలిపారు. హోలీ సందర్భంగా వేదపండితులు ఆలయంలో రతీమన్మథులను ప్రత్యేకంగా అలకంరించి పూజలు నిర్వహించారు. కర్ణాటక సరిహద్దు గ్రామమైన సంతెకుడ్లూరులో జరిగే ఈ ఉత్సవాలకు సమీప ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తారు. పూజల్లో పాల్గొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.
రతీమన్మథులకు మొక్కులు
పురుషులు చీరలు, గాజులు, పూలు ధరించి గ్రామంలోని రతీమన్మథులను దర్శించుకుంటారు. మగవారు కుటుంబ సభ్యులతో సహా మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తునప్పుడు డప్పు సందళ్లతో కోలాహాలంగా ఉంటుంది. ప్రతీ ఏట హోలీ రోజున ఎంతో సంబరం గ్రామస్థులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. మగవారు మహిళల వేషధారణలో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ అని గ్రామస్థులు చెబుతున్నారు. తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తుందని చెబుతున్నారు. పురుష, స్త్రీ భేదాలను తొలగించి, సమానత్వాన్ని చాటిచెప్పేలా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ మహిళల వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారని గ్రామస్థులు తెలిపారు.