Ysrcp Protest :  కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు వినూత్న నిరసన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో పత్తికొండ అపవిత్రమైందని వైసీపీ నేతలు ఆరోపించారు. పత్తికొండను పవిత్రం చేసేందుకు  రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి శుభ్రపరుస్తున్నామన్నారు. చంద్రబాబు మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు పర్యటనతో పత్తికొండ అపవిత్రమైందనంటూ పత్తికొండ పట్టణంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు వినూత్న రీతిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో కరవు కాటకాలతో అల్లాడిపోయే రైతులు నేడు జగనన్న పాలనలో సమృద్ధి వర్షాలతో వ్యవసాయం చేసుకుంటున్నారని వైసీపీ నేతలు తెలిపారు. కరవుకు మారుపేరుగా ఉన్న చంద్రబాబు పత్తికొండకు వచ్చినందుకు పసుపు నీళ్లతో రహదారులను శుద్ధి చేశామన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రధాన రహదారి అంతా పసుపు నీళ్లు చల్లుతూ శుభ్రం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.  


చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు- మంత్రి గుమ్మనూరు జయరాం


రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారన్నారు. మంత్రి జయరాం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదన్నారు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరన్నారు.  తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే న్యాయవాదులపై దుర్భాషలాడారన్నారు. వికేంద్రీకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.  రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్‌ చెలగాటం ఆడుతున్నారన్నారు. 


చంద్రబాబుకు నిరసన సెగ 


చంద్రబాబు కర్నూలు పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాదులు గో బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల నిరసనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు అదుపు చేయలేకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. వైసీపీ నేతలు గూండా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్ వద్ద మాట్లాడుతున్న చంద్రబాబును న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. చంద్రబాబు రాయలసీమ ద్రోహీ, గో  బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అయితే న్యాయవాదులు, వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. 


సీఎం జగన్ రాయలసీమ ద్రోహి 


"గూండాలందరినీ హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. దాడులకు పాల్పడిన వారిని తరిమి తరిమి కొడతాం. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి నేను వస్తా. తమాషా అనుకున్నారా వైసీపీ చోటామోటా రౌడీలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు. బట్టలిప్పించి కొట్టిస్తా దద్దమ్మలారా? పనికిమాలిన వ్యక్తుల్లారా నేరాలు-ఘోరాలు చేసిన దరిద్రులారా అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రౌడీలకు రౌడీని గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహనం పాటిస్తున్నాం. మా కార్యకర్తలకు పిలుపునిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే  మీ జగన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడా?.ఎవడ్రా రాయలసీమ దోహి, రాయలసీమను రత్నాల సీమను చేసాం. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్. " - చంద్రబాబు