Bandi Sanjay : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి తెలంగాణలో తీవ్ర సంచలనం అయింది. ఈ దాడి ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్  చేసిన కామెంట్స్ ఈ వివాదానికి దారితీశాయి. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎంపీ అర్వింద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  శనివారం అర్వింద్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ఆయనతో మాట్లాడి దాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. 






హిందూ దేవుళ్లపై దాడి 


ఎంపీ అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడి చేశారని బండి సంజయ్ విమర్శించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలా ఎందుకు దాడి చేశారో కూడా వారికి తెలియదన్నారు. ఇంటిలో పగిలిన వస్తువుల గురించి పెద్దగా బాధలేదని కానీ హిందూ దేవుళ్ల దాడి చేయడం సరికాదన్నారు.  తనపై మీద దాడి చేసినా పెద్దగా పట్టించుకోనన్న ఆయన... హిందువులు పవిత్రంగా కొలిచే తులసీ మాత, లక్ష్మీ దేవీ, దుర్గా మాత ప్రతిమలు ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్‌ క్రోమో ఫోబియాతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ  కేసీఆర్ టెన్షన్‌ పట్టుకుందని ఆరోపించారు. ఎంపీ అర్వింద్‌ విమర్శలు మాత్రమే చేశారని, బూతులు ఏం మాట్లాడలేదుకదా అన్నారు. దాడుల సంస్కృతి మంచిది కాదని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం అహంకారాన్ని తెలంగాణ ప్రజలంతా చూశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ స్పష్టం చేశారు. 


బూతులేం మాట్లాడలేదు కదా? 


ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల సహకారంతోనే దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. దాడి జరిగిన సమయంలో అర్వింద్ ఇంట్లో లేకపోవడం అదృష్టమన్నారు. కేసీఆర్ కు ఫోబియా వల్లే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. అక్క రెడీ అనగానే తమ్ముళ్లు దాడికి సిద్ధమయ్యారన్నారు. అర్వింద్ బూతులేం మాట్లాడలేదన్నారు. ఇంటిపై తమ పార్టీ వాళ్లు దాడి చేసినా సహించనన్నారు. ఆయన ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? మీ అయ్య ఇస్తాడా? అంటూ బండి సంజయ్ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. 


8 మంది అరెస్టు 


బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో 8 మంది టీఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఎంపీ అర్వింద్ ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. దీనిపై ధర్మపురి అర్వింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది అరెస్ట్ చేశారు. ఐపీసీ 452,148,427,323,354, r/w 149 సెక్షన్ల కింద దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు పోలీసులు.