కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలీ మండలం కలిచాట్ల వంతెన వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకరు వైసీపీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరు ఓ టీవీ ఛానెల్ విలేకరి కూడా ఉన్నారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం మద్దూరుకు చెందిన వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి, ఓ టీవీ ఛానెల్ విలేకరి సుధాకర్ గౌడ్, డ్రైవర్ లింగం ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ నేత, ఇతరులు ఇన్నోవా కారులో బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్యాపిలి మండలం కలిచాట్ల వంతెన దగ్గర కారు టైరు పేలి ఆగివున్న లారీ బలంగా ఢీకొట్టారు.
వైసీపీ నేత దుర్మరణం
వేగంతో ఉన్న కారు ఎదురుగా ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి, విలేకరి సుధాకర్ గౌడ్, లింగం ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న కంటైనర్ ను మరో కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆగిఉన్న కంటైనర్‌లోని డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని, సహాయచర్యలు చేపట్టారు. హైవే నిర్వహణ సిబ్బంది సహాయంతో క్యాబిన్‌ను పక్కకు తొలగించి డ్రైవర్‌ను ప్రాణాలతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడి ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయి పక్కకు వెళ్లాయి. దీంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను వేరే వాహనంలో గమ్యస్థానాలకు చేర్చారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. బస్సుల ఫిట్‌నెస్ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు మంత్రికి ఆర్టీసీ ఎండీ తెలిపారు.
Also Read: Pocso Case: ఏపీలో దారుణ ఘటన... బాలికపై సామూహిక అత్యాచారం... పోక్సో చట్టం కింద కేసు నమోదు