Konaseema News :కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్రంలో బోటు బోల్తా పడింది. కాకినాడకు చెందిన పది మంది మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బోల్తా పడిన బోటుపై సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సముద్రంలో ఆఫ్షోర్ లో ఉన్నటువంటి రిగ్గు వద్దకు వెళుతున్న హెలికాప్టర్ నుంచి మత్స్యకారులను పైలట్, రవ్వ కేయిర్న్ ఎనర్జీ సంస్థ అధికారులు గమనించారు. మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.యానాం ఒ.ఎన్.జి.సి హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు మెరైన్ పోలీసులు. మత్స్యకారులను హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా కాకినాడ చేర్చారు మెరైన్ పోలీసులు.
వాగులో కారు గల్లంతు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని అంద్ గూడ, కెరమెరి మండలం అనార్ పల్లి గ్రామాల మధ్యలోని వాగులో కారు గల్లంతయ్యింది. కెరమెరి మండలం అనార్ పల్లికి చెందిన రాజేష్ అంద్ గూడ వైపు నుంచి అనార్ పల్లికి వస్తున్నప్పుడు భారీ వర్షం కురిసింది. దీంతో అంద్ గూడ, అనార్ పల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో, ప్రవాహం తక్కువగా ఉందని భావించి డ్రైవర్ కారును వాగు దాటించే ప్రయత్నం చేశారు. నీటి ప్రవాహానికి కారు అదుపుతప్పి వాగులో కొట్టుకెళ్లిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ రాజేష్ కారు నుంచి దూకడంతో, తృటిలో ప్రాణ ప్రాయం నుంచి బయటపడ్డాడు. డ్రైవింగ్ చేస్తోన్న రాజేష్ చాకచక్యంగా కారు నుంచి దూకడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వరద నీటిలో కారు కిలోమీటరు దూరం వరకు కొట్టుకుపోయింది. డ్రైవర్ రాజేష్ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు కరంజివాడ వెళ్లే దారిలో కారును గుర్తించి బయటికి లాగారు.
ప్రమాదకర ప్రయాణాలు
ఇటీవల వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదకరమని తెలిసినా వాహనదారులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో వాగులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పెంచికల్ పేట్-సలుగుపల్లి ప్రధాన రహదారిపై తీగల వాగు గురువారం కురిసిన వర్షానికి ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రవాహం తగ్గే వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కానీ కొంత మంది ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న వాగులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి రాకపోకలను నిలిపివేసి, తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read : Producer Ashwini Dutt On TTD : తిరుపతిని సర్వనాశనం చేశారు - వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై అశ్వనీదత్ విమర్శలు