స్వాతంత్ర్య సమరయోధులు వారి కోసమే స్వాతంత్రం కోసం పోరాడలేదని.. దేశ ప్రజలందరి కోసం పోరాడారని... అలాగే రాజధాని అనేది అందరికీ సంబంధించినదని.. భూమలు ఇచ్చిన రైతులది మాత్రమే కాదని ఏపీ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాలనా వికేంద్రీకరణ బిల్లులు, సీఆర్డీఏ రద్దు పై రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు రోజువారి విచారణ కొనసాగుతోంది. సోమవారం ప్రారంభమైన విచారణలో రైతుల తరపు న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. ఆయన వాదనలు మంగళవారం కూడా కొనసాగాయి.
రాజధాని సమస్య 29 గ్రామాల రైతుల సమస్య అన్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ వాదనలు వినిపిస్తున్న సమయంలో సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారని.. అంటే అమరావతి ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు అంటే.. అది వాళ్ల కోసం పోరాడటం మాత్రమే కాదని..స్వాతంత్ర్య సమరయోధులు దేశ ప్రజలందరి కోసం పోరాడటమేనని గుర్తు చేశారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు.
Also Read : ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
అమరావతి పిటిషన్లపై విచారణ సుదీర్ఘ కాలం తర్వాత సోమవారమే ప్రారంభమయింది. విచారణ ప్రారంభమైన సమయంలో ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు బెంచ్‌లో ఉండకూడదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. అయితే వారి విజ్ఞప్తిని తోసి పుచ్చిన ధర్మానసం విచారణ కొనసాగిస్తోంది. రాజధాని పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయినట్లుగా ఉందని వ్యాఖ్యానించిన సీజే వీలైనంత త్వరగా పిటిషన్లను పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో రోజువారి విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
రాజధాని రైతులు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఇప్పటికి 700 రోజులుగా నిరసన చేపట్టారు. వారిపై పోలీసుల లాఠీలు విరిగాయి. అయినా వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారు.
Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నో పర్మిషన్.. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న డీజీపీ !