Kanna On Somu : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరోసారి వివాదాలు బహిర్గతమయ్యాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కొంత మంది బీజేపీ జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు మార్చారు. వీటిలో గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఉంది. ఇప్పటి వరకూ కన్నా అనుచరుడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను తొలగించారు. దీంతో కన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటిలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని మండిపడ్డారు.
జిల్లా అధ్యక్షుల మార్పు గురించి తనతో ఎవరూ చర్చించలేదని.. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనన్నాపు, కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం మాకు తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలన్నారరు. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు ఉన్నారని.. ఆయన బీఆర్ఎస్‌లో ఎందుకు చేరారో సోము వీర్రాజు చెప్పాలన్నారు. ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశామని గుర్తు చేశారు.
జగన్ - కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్లారని కన్నా అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. పవన్‌కు మేమంతా అండగా ఉంటాం. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోంది’’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మినారాయణ ఇటీవలి కాలంలో పార్టీపై.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై అసంతృప్తి వ్యక్తం చేయడం రెండో సారి. ఆయన కొద్ది రోజుల కిందట పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఫోన్ చేసి.. బహిరంగంగా మాట్లాడవద్దని సూచించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
తాజాగా జిల్లాల అధ్యక్షుల మార్పు వ్యవహారంతో కన్నా రగిలిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన కన్నా లక్ష్మినారాయణను తర్వాత తప్పించారు. సోము వీర్రాజుకు బాధ్యతలిచ్చారు. అప్పట్నుంచి కన్నాకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. అదే సమయంలో సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా ఉన్న కన్నా వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలవాలనుకుంటున్నారు. బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే ఆశలు ఉండవు. జనసేన పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేసే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన అటు వైపు చుస్తూన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పవన్ కు అండగా ఉంటామని కన్నా ప్రకటిస్తూండటం రాజకీయవర్గాలు ఇదే నిజమని నమ్మడానికి కారణం అవుతోంది.