రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు నిచ్చింది. ఈ మేరకు హెూం శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. 


మీరంటే మీరు


తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ రెండు కార్యక్రమాలకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తొక్కిసలాటలు జరిగింది. ఫలితంగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటనలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని అధికార వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు పాల్గొనే సభలకు సరైన రీతిలో బందోబస్తు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇది జరిగిందని ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు ధ్వజమెత్తుతున్నారు. 


నిషేధ ఉత్తర్వులతో రగిలిన రాజకీయం


ఒక పక్క విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు హాట్ హాట్‌గా మారగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పుణ్యమా అని అరుదైన సందర్భాల్లో తప్పితే రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు సభలు మైదానాల్లో, పొలాల్లోనే నిర్వహించుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి కనిపిస్తోంది. మరి ర్యాలీలు, రోడ్ షోల సంగతేంటన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. 


రోడ్‌ షోలతో జనాలకు చేరువుగా


రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించడం సర్వసాధారణం. అది అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా తమ వాణిని జనాలకి వినిపించేందుకు వాటిని విరివిగా నిర్వహిస్తుంటారు. ఇదే సందర్భంలో రోడ్ షోల ద్వారా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది. ఎన్నికల సీజన్‌లో అయితే ఇక వేరే చెప్పనక్కర్లేదు. అధికారంలో ఉన్న పార్టీతోపాటు ప్రతిపక్షాలు పోటాపోటీగా సభలు, రోడ్ షోలను నిర్వహిస్తుంటాయి. ఇందు కోసం ప్రత్యేకంగా జన సమీకరణ కూడా చేస్తుంది. అధికారిక కార్యక్రమాలను సైతం రోడ్ల మీదనే నిర్వహించడం, చైతన్య అవగాహన ర్యాలీలు సైతం చేపడుతుంటారు. ఇప్పుడు వాటి సంగతేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


ఎన్నికల సీజన్‌లో ఏంటి పరిస్థితి?


రానున్నది ఎన్నికల సీజన్ మరో ఆరు నెలల్లో ఆ వేడి ప్రారంభం కాబోతుంది. వచ్చే ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన అధ్యక్షులు, ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంది. ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టే ఛాన్స్ లేకపోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాటిని కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ జరుగుతున్నాయి. అడుగడుగునా ఆంక్షల నడుమ వాటిని అధికారులు పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఎటొచ్చి తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకే ఇబ్బందులు ఎదురుకానున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


లోకేష్‌, పవన్ యాత్రకు తిప్పలు తప్పవా!


ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జిల్లాలలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటుండడంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ప్రజలు వాటికి తరలివస్తున్నారు. వాటి సంగతేంటన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో 400ల రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఆ పాదయాత్ర సైతం రోడ్ల మీదనే కొనసాగనుంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. బస్సు యాత్ర చేపట్టడం ద్వారా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజల మద్యకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వారి కార్యక్రమాల నిర్వహణ పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 


రాజశేఖర్‌రెడ్డి నుంచి జగన్ వరకు సాఫీగా పాదయాత్రలు


గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయురాలు వైఎస్ షర్మిళ, ప్రస్తుత సిఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రలు చేశారు. వాటికి పెద్ద ఎత్తున 'ప్రజల నుంచి స్పందన వచ్చింది. అయితే అప్పుడెక్కడ కూడా తొక్కిసలాటలు వంటివి చోటుచేసుకోలేదు. వారి పాదయాత్రలు సజావుగా జరిగాయి. అప్పట్లో వారు ఎన్నికల ప్రచారాల సమయంలో కూడా రోడ్లపైనే సభలు, సమావేశాలు నిర్వహించే వారు. తాజా ఉత్తర్వుల కారణంగా రానున్న ఎన్నికల సీజన్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహణపై కూడా ప్రభావం పడనుంది. 


బహిరంగ సభలకు స్థలం సమస్యలు


శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కూడా రోడ్లు అంతా విశాలంగా ఉండే పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగ సభలకి ఏడు రోడ్ల జంక్షన్ నే వేదికగా ఎంచుకుంటున్నాయి. అక్కడే హడావుడి చేస్తుంటాయి. తాజా ఆదేశాలతో ఇక పై ఏడు రోడ్ల జంక్షన్ వద్ద అత్యంత అరుదైన సందర్భాలలో తప్పితే అనుమతులు ఇచ్చే పరిస్థితులు కానరావడం లేదు. అటువంటప్పుడు 80 అడుగుల రోడ్డులో ఖాళీగా ఉన్న పొలాలు, మైదాన ప్రాంతమే దిక్కు కానుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నయ ప్రదేశాలు చూడాలని ప్రభుత్వం జిల్లా అధికారులకి సూచించింది. 


ఆ లెక్కన నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న మైదానాలు, నగర శివార్లలోని ఖాళీ ప్రదేశాలే వారు గుర్తించాలి తప్పా అంతకుమించిన స్థలాలు లేవు. సభల వరకూ వారు స్థలాలు గుర్తించినా మరి ర్యాలీలు, రోడ్డు షోల సంగతేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీ నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా రాజకీయ వర్గాలలో చర్చణీయాంశంగా మారాయి. అయితే ఆ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయా లేదంటే కొందరికే షాక్ ఇస్తాయోననేది వేచిచూస్తేనే తెలుస్తోంది.