ప్రత్యర్థులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి సభలు సమావేశాలతో ఉక్కరిబిక్కిరి అవుతున్న అధికార వైసీపీకి సొంత పార్టీ నేతలే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏదో అసంతృప్తితో ప్రభుత్వం పనితీరుపై కొందరు నేరుగా మరికొందరు ఇన్‌డైరెక్ట్‌గా విమర్సలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికార పక్షానికి మింగుడు పడని అంశం. ఇప్పుడు ఒకటి రెండు స్వరాలు అనుకున్నా అవి పెరిగే ఛాన్స్‌ లేకుండా ఆదిలోనే చెక్‌పెట్టాలని భావిస్తోంది వైసీపీ. అందుకే వారిని కేపసిటీ అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చేస్తోంది. మిగతా వాళ్లకు సూటిగా సుత్తిలేకుండా నేరుగానే వార్నింగ్ ఇస్తోంది. 
 
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు స్వరం మారుస్తున్నారు. పనులు కావడం లేదంటూ కొందరు, తమకు ఎలాంటి విలువ లేదంటూ మరికొందరు అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ప్రభుత్వ చర్యలను సమర్థించాల్సిన సభ్యులు ఇలా పార్టీ లైన్‌ క్రాస్ చేసి మాట్లాతుండటంతో ప్రతిపక్షాలకు మంచి ఆయుధాలు దొరుకుతున్నాయి. ఈ వ్యవహరం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలు, శాసన సభ్యులే స్వయంగా చేస్తున్న వ్యాఖ్యలు మెయిన్‌ మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ట్రోల్ అవుతున్నాయి. దీంతో వైసీపీ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అయినా అసలు విషయం చెప్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అందుకే దీనికో ఫార్ములా కనిపెట్టింది వైసీపీ అధినాయత్వం.


అలా మెదలైన వివాదం....


అధికార పార్టీలో వివాదాలు చాలా కామన్‌గా కనిపించేవి. కానీ జగన్ ప్రభుత్వం అలాంటివి లేకుండా ముందు నుంచి చాలా జాగ్రత్త పడింది. జగన్‌పై ఉన్న నమ్మకంతోనే ప్రజలంతా ఓట్లు వేశారనే ఆలోచనతో శాసన సభ్యులు, ఇంచార్జ్‌లు కూడా సైలెంట్‌గా ఉన్నారు. స్వరం పెంచి మాట్లాడితే చేటు తప్పదనే సంకేతాలు పార్టీ అధిష్ఠానం మొదటి నుంచీ పంపుతూనే ఉంది. మొదటగా తాడికొండ నియోజకవర్గంలో మొదలైన వివాదం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. 


తాడికొండ నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, పూర్తిగా జగన్ పైనే డిపెండ్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారు. వైద్యురాలిగా పని చేసే శ్రీదేవి రాజకీయాలపై ఆసక్తితో వైసీపీ కండువా కప్పుకున్నారు. అక్కడ నుంచి మొదలయిన ఆమె రాజకీయ ప్రస్తానం అత్యంత కీలకమైన తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అమరావతి ప్రాంత నుంచి ఎన్నికైన ఆమె ఒక్కసారికా స్టార్ అయిపోయారు. 


శ్రీదేవి ఎంత స్పీడ్‌గా ఎదిగి... హాట్‌టాపిక్ అయ్యారో అంతే వేగంగా ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. నమ్మిన వ్యక్తులు కూడా శ్రీదేవికి హ్యాండ్ ఇవ్వటంతోపాటు ఎంపీ నందిగం సురేష్‌తో విభేదాలు ఆమెను మరింత సమస్యల్లో పడేశాయి. దీంతో శ్రీదేవి వివాదాల నేతగా పార్టీలో ముద్రపడిపోయారు. వరుసగా వివాదాలు ముసరటంతో పార్టీ నాయకులు ఆమెతో చర్చలు జరిపి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. దీంతో పార్టీ అధినాయకత్వం తాడికొండ నియోజకవర్గానిక పరిశీలకుడిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. దీంతో శ్రీదేవి వర్గం భగ్గుమంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీదేవి వర్గం మాజీ హోమంత్రి సుచరిత ఇంటి ముందు ధర్నాకు దిగటం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకు పార్టీ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. దీంతో వ్యవహరం సద్దుమణిగింది. ఆ తరువాత డొక్కాను జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా నియమించిన అధిష్ఠానం మరో వ్యక్తిని పరిశీలకుడిగా నియమించింది. ఇదంతా శ్రీదేవిని పొమ్మనలేక పొగబెట్టటమే అన్న అభిప్రాయం పార్టీలో ప్రచారం జరుగుతుంది.


పొన్నూరులో కూడ ఇదే పరిస్థితి 
పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. స్థానిక శాసన సభ్యులు కిలారి రోశయ్యకు, అదే ప్రాంతానికి చెందిన మరో కీలకనేత రావి వెంకటరమణకు మధ్య విభేదాలు ఉన్నాయి. మొదటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన రావి వెంకట రమణను కాదని ఆఖరి నిమిషంలో పార్టీ సీటును కిలారికి కేటాయించారు. దీంతో రావి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ స్వయంగా రావికి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఎన్నికల్లో కిలారి రోశయ్య విజయానికి రావి వర్గం సహకరించింది. అయితే ఆ వర్గం తన విజయానికి సహకరించలేదని... వ్యతిరేకంగా పని చేసిందని... ఇప్పుడు కూడా అదే పనిలో ఉందని జగన్ ఫిర్యాదు చేశారు కిలారి. దీంతో ఈ వ్యవహరాన్ని క్రమశిక్షణ కమిటి ముందుకు పంపారు జగన్. ఆ కమిటి అన్ని ఆధారాలను పరిశీలించి, రావికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది. దీంతో రావిని పార్టి నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది.


వెంకటగిరి,పర్చూరు సేమ్ సీన్స్
వెంటకగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల పార్టీ, ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పార్టీకి ఇబ్బందిగా మారింది. వాస్తవ పరిస్థితులు చెబుతున్నాని ఆనం వెంకట నారాయణ రెడ్డి చెబుతున్నా... ఆనం వ్యతిరేక వర్గంగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పార్టి సమన్వయ బాధ్యతలను అప్పగించింది పార్టీ. పర్చూరలో కూడా పార్టీపరంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీకి ఆటుపోట్లేనని నేతలు అంటున్నారు. పార్టీ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. 2019 ఎన్నికల్లో అప్పటికే ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రావి రామనాథంబాబును పక్కన పెట్టిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. దాంతో రామనాథం బాబు టీడీపీలోకి వెళ్లారు. ఎన్నికల తరువాత రామనాథంను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి, నియోజ కవర్గ బాధ్యతలు అప్పగించారు.


2020 మార్చిలో చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు తెలిపారు. అప్పటి వరకూ అక్కడున్న పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు వెళ్లాలని సూచించారు. అందుకు ఆమంచి అంగీకరించలేదు. దీంతో మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డిని, పర్చూరు సమన్వయకర్తగా నియ మించడానికి ప్రయత్నించారు. అమంచిని పర్చూరుకు పంపే విషయంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకొని, వేరొకరికి బాధ్యతలను అప్పగించేందుకు జగన్‌తో మాట్లాడారు. అయితే హఠాత్తుగా ఆమంచి కృష్ణమోహన్‌కే పర్చూరు బాధ్యతలు అప్పగించారు. 


ఇలా పార్టీలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న వారిని తప్పించి వారి స్థానంలో ఇన్‌ఛార్జ్‌లను నియమించడంపై వారిని పొన్నలేక పొగబెడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో సర్వేలు ఆధారంగా ఇద్దరిలో ఎవరికి మొగ్గు ఉంటే వాళ్లనే అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.