Anjali Accident Case:


కావాలనే చేశారా..? 


ఢిల్లీలోని కంజావాలా కేసులో ఇటీవలే ఓ కీలక విషయం వెల్లడైంది. అంజలీ సింగ్ (మృతురాలు) ప్రమాదానికి గురైన సమయంలో స్కూటీపై వెనక తన స్నేహితురాలు కూడా ఉందని సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. వీళ్లిద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. ఆ సమయం లోనే ప్రమాదం జరిగింది. అయితే...ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే బాధితురాలి స్నేహితురాలు నిధి అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఇదే పలు అనుమానాలకు తావిచ్చింది. తన ఫ్రెండ్‌కు యాక్సిడెంట్‌ అయి అలా పడి ఉంటే ఎలా వదిలి వెళ్లిందని అంతా విమర్శించారు. పోలీసులు దీనిపై ఆరా తీశారు. ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే...మృతురాలి స్నేహితు రాలు నిధి స్పందించింది. అంజలి కార్‌ టైర్‌లకు చిక్కుకున్న సంగతి నిందితులకు తెలుసని సంచలన విషయం వెల్లడించింది. స్కూటీపై నిధి, అంజలికి చిన్న పాటి గొడవ అయింది. ఆ సమయంలోనే కార్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఇద్దరూ కింద పడిపోయారు. నిధి కాస్త దూరంగా కింద పడిపోయింది. అంజలి మాత్రం కార్‌ చక్రాలకు చిక్కుకుపోయింది. దీనిపై నిధి ఇస్తున్న వివరాల ప్రకారం...ఇది కావాలనే చేశారా అన్న మరో అనుమానం తెరపైకి వచ్చింది. "బలెనో కార్‌ మమ్మల్ని బలంగా ఢీకొట్టింది. నేను పక్కకు పడిపోయాను. అంజలి కార్‌కు ఎదురుగా పడిపోయింది" అని వివరించింది. "అంజలి కార్‌ కింద చిక్కుకుపోయింది. కార్‌లో ఉన్న వాళ్లకు ఈ విషయం తెలుసు. కానీ...పట్టించుకోకుండా అలా వేగంగా వెళ్లిపోయారు. అప్పటికే అంజలి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో నేను ఏమీ చేయలేకపోయాను. ఇంటికి వెళ్లిపోయాను" అని చెప్పింది నిధి. "ఇంటికి వెళ్లి చాలా ఏడ్చేశాను. భయపడిపోయాను. వాళ్లు కార్‌ను రెండుసార్లు వెనక్కి ముందుకు నడిపారు. అప్పుడే అంజలి కార్‌కు చిక్కుకుంది. వాళ్లు పట్టించుకోకుండానే అలా వెళ్లిపోయారు" అని వెల్లడించింది.






పోస్ట్‌మార్టం రిపోర్ట్..


పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా నిందితులు చెప్పిన సమాధానాలనూ వెల్లడించారు. అసలు  ఆ యువతి తమ కార్‌కు చిక్కుకుని ఉందన్న సంగతే గుర్తించలేదని అంటున్నారు నిందితులు. ఇందులో నిజానిజాలు ఇంకా తేలకపోయినా...ఈ కేసు మాత్రం దేశ రాజధానిలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఇటీవలే యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు పోలీసులు. దీని ప్రకారం...ఆ యువతి అత్యంత దారుణంగా చనిపోయింది. తల చీలిపోయి...ఎముకలన్నీ విరిగిపోయాయని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. పక్కటెముకలు చీల్చుకుని బయటకు వచ్చేశాయని వైద్యులు వివరించారు. మౌలానా ఆజాద్ కాలేజ్‌కు చెందిన ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ యువతి డెడ్‌బాడీని పరిశీలించి...ఈ రిపోర్ట్‌ను వెలువరించింది. తల, వెన్నెముకతో పాటు ఊపిరి తిత్తులకూ బలమైన గాయాలైన కారణంగానే మృతి చెందినట్టు నిర్ధరించారు వైద్యులు. యాక్సిడెంట్‌ కారణంగా షాక్‌కు గురైందని, ఆ తరవాత తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఒంటిపైన మొత్తం 40 గాయాలైనట్టు గుర్తించారు. 


Also Read: Delhi Girl Attacked: బ్రేకప్ చెప్పినందుకు రెచ్చిపోయిన యువకుడు, యువతిపై కత్తితో దాడి