Kadapa News : కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నర్సిరెడ్డి పల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడపగడప కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న కొందరు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లో లేకుండా వెళ్లిపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఊరికి రోడ్డు లేదని ఆ ఊరి ప్రజలకు రోడ్డు వేస్తామని ప్రజా ప్రతినిధులు మాట ఇచ్చి మాట తప్పారని గ్రామస్థులు వాపోయారు. ఇలా చేయడం ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఎంపీపీ జడ్పీటీసీలు దేవుని దగ్గర ప్రమాణం చేసి మీ ఊరికి అంతా మంచి చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. మౌలికవసతులు కల్పించడంలో విఫలమయ్యారని అందుకే ఇలా చేశామని గ్రామస్థులు అంటున్నారు.
తిట్టుకోవడం తప్ప ఈ నాయకులు చేసిందేం లేదు
"మా ఊరికి ఉంది మామూలు తోవే. దానిని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఎవరొచ్చీ ఏం చేసేదేం లేదు. వీళ్లను వాళ్లు వాళ్లను వీళ్లు తిట్టుకోవడం తప్పితే ఎవరూ ఏం చేయడంలేదు. ప్రజలకు ఏం చేసేదేంలేదు. వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్లకు చేసుకుంటున్నారు. మా ఊరికి రోడ్డు వేస్తామని ప్రమాణం కూడా చేశారు. జడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఊరికి రోడ్డు వేస్తామని ప్రమాణం కూడా చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోలేదు. ఊరి ప్రజలకు కావాల్సింది రోడ్డు. పోయిన ఎన్నికల ముందు రోడ్డు విడగొట్టారు వేస్తామని కానీ అది అలానే ఉంది. నేను పుట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ ఆ రోడ్డు అలానే ఉంది. నాకు ఇప్పుడు 76 ఏళ్లు వచ్చాయి. పార్టీల కోసం నిలబడి ఓట్లు వేయించాం. కానీ ఇప్పటి వరకూ రోడ్డు లేదు. నాయకుల్ని పోయి అడాలంటున్నారు వాళ్లను అడిగేటట్లు అయితే వీళ్లేందుకు ఓట్లు కోసం వస్తున్నారు. ఎవరూ చేసిందేం లేదు ఎవరి స్వార్థాలు వాళ్లవి." - నర్సిరెడ్డి పల్లి గ్రామస్థుడు
గడపగడపకు కార్యక్రమం తప్పనిసరి
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సీఎం జగన్ ... మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే ఎమ్మెల్యేల పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి సీఎం జగన్ వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. అయితే వైసీపీ నేతలకు మాత్రం గడప గడపకు కార్యక్రమంలో నిరసన సెగలు తప్పడంలేదు. సంక్షేమ పథకాల విషయంలో కొందరు వివక్ష చూపిస్తున్నారని, తమకు పథకాలు అందడంలేదని కొందరు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. మంత్రులకు సైతం చేదు అనుభవం ఎదురైన ఘటనలు ఉన్నాయి.
ఎమ్మెల్యేలకు నిరసన సెగ
ఇటీవల మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణకు గడప గడపకు కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ గడపగడపకు కార్యక్రమంలో పర్యటించారు. ఈ క్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు హరికృష్ణ ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే శంకర నారాయణను గ్రామంలోని సమస్యలపై హరికృష్ణ నిలదీశారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపట్టిన పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే కాళ్లపై పూలు చల్లించడం వివాదం అయింది. గ్రామంలో సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలపై, విక్రమ్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి దిగడంపై విమర్శలు వచ్చాయి. సంక్షేమ పథకాలు అందకుండానే అందినట్టు కరపత్రాలు ముద్రించారని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.