BJP Somu Veerraju : వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు సోమూ వీర్రాజు, వై.సత్యకుమార్ ఫైర్ అయ్యారు. పాలించేది చేత కాకపోతే దిగిపోవాలని సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అత్యాచార బాధితులకు న్యాయం చేయకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు. అత్యాచార ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉంటే ఎన్ కౌంటర్ చేయాలన్నారు. పోలీసులను కట్టడి చేసే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. గుప్పెడు ఎమ్మెల్యేలతో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని విర్రవీగితే ఎలా.. దేశంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందని గుర్తుచేశారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా ఉంటుందో వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. కేంద్రం హెల్త్ మిషన్ కింద ఇచ్చే నిధులను ప్రభుత్వం దారి మళ్లించి ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో పరిపాలన లేదని, సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం లేదని ఆరోపించారు. సొంత జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై చర్యలు లేవన్నారు.
నేరస్థులకు భయం లేదు
కడపలో బీజేపీ కార్యాలయం నిర్మాణానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం భూమి పూజ చేశారు. అక్కడ సోమువీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రతిరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను గమనిస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవడంలేదన్నారు. అందువల్ల నేరస్థులకు భయం ఉండడంలేదన్నారు. ఇలాంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుందన్నారు. మహిళలపై రోజు దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనలపై మహిళా మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు.
మహిళా మోర్చా కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తుంది
ఉద్యమాలు చేస్తున్న మహిళా మోర్చా కార్యకర్తలను ప్రభుత్వం గృహ నిర్బంధానికి గురిచేస్తుందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల పట్ల ఇలా వ్యవహరించడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను బీజేపీ ఎండగడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు బీజేపీ అడ్డుకట్ట వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సంఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి విషయంలో వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి చేస్తున్న దాష్టీకాలకు అడ్డుకట్ట వేశామని సోము వీర్రాజు అన్నారు. ఎమ్మెల్యే హిందూ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటున్నారని ఈ విషయాన్ని బీజేపీ గమనిస్తోందన్నారు.
హనుమాన్ ర్యాలీపై దాడి
నెల్లూరు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీ విషయంలో కూడా ప్రభుత్వం అండ చూసుకుని ర్యాలీపై ముష్కరలు రాళ్లదాడి చేశారని సోము వీర్రాజు తెలిపారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. 1972 నుంచి ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టారని బీజేపీ ఉద్యమం ద్వారా ఈ సమస్య వెలుగుచూసిన పరిస్థితి ఉందన్నారు. బీజేవైఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తుందని వివరించారు.
బీజేపీ కార్యాలయం భూమిపూజ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బిల్డింగ్ కమిటీ ఛైర్మన్ సైదారెడ్డి, జిల్లా ఇన్ ఛార్జి అంకాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.