మలయాళంలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మంజు వారియర్. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ నటి. 43 ఏళ్ల ఈ సుందరికి ఇప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈమెని వేధింపులకు గురి చేసిన కేసులో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 


తిరువనంతపురంలో మే 5న సనల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సనల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ 'కయాట్టం' అనే సినిమాలో నటిస్తోంది. 2020లో ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాత కూడా సనల్ కుమార్.. మంజు వారియర్ కి మెసేజ్ లు పంపిస్తూ ఆమెని వేధింపులకు గురిచేశాడని హీరోయిన్ ఆరోపించింది. 


పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా.. సనల్ కుమార్ తన తీరు మార్చుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తిరువనంతపురంలో ఉన్న సనల్‌ కుమార్‌ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 


దర్శకుడిగా సనల్ కుమార్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కేరళ ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సైతం ఆయనకు అవార్డులు దక్కాయి. అలాంటి డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులు చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.