సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (92 నాటౌట్: 58 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రొవ్‌మన్ పావెల్‌తో డేవిడ్ వార్నర్ అన్న మాటలు తన స్థాయిని మరింత పెంచాయి.


19వ ఓవర్ ముగిసేసరికి డేవిడ్ వార్నర్ 92 పరుగుల మీద ఉన్నాడు. 20వ ఓవర్ మొదటి బంతి రొవ్‌మన్ పావెల్ ఎదుర్కోవాలి. అయితే రొవ్‌మన్ పావెల్... డేవిడ్ వార్నర్ వద్దకు వెళ్లి ‘సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వనా’ అని అడిగాడు. అప్పుడు ‘మేం క్రికెట్ ఆడే పద్ధతి ఇది కాదు. సెంచరీలు నాకు ముఖ్యం కాదు. నువ్వు బంతిని ఎంత బలంగా కొట్టగలవో అంత బలంగా కొట్టు’ అని డేవిడ్ వార్నర్ అన్నాడు.


దీంతో చివరి ఓవర్లో చెలరేగి ఆడిన రొవ్‌మన్ పావెల్ ఏకంగా 19 పరుగులు సాధించాడు. వీటిలో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉండటం విశేషం. డేవిడ్ వార్నర్ అన్న మాటల గురించి రొవ్‌మన్ పావెల్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జట్టు ప్రయోజనాలకు డేవిడ్ వార్నర్ ఇచ్చే ప్రాధాన్యతపై ప్రశంసల వర్షం కురుస్తుంది.


ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ట్రోల్ చేస్తున్నారు. జట్టుకు ఇంత ప్రాధాన్యతను ఇచ్చే డేవిడ్ వార్నర్‌ను అంత దారుణంగా ట్రీట్ చేస్తారా అంటూ హైదరాబాద్‌ను ఏకి పారేస్తున్నారు. దీనికి తోడు సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేలవ ఫాంలో ఉండటంతో సన్‌రైజర్స్ అభిమానులు కూడా జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.