JC Prabhakar Reddy News: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆసక్తికర ఘటన జరిగింది. మళ్లీ టీడీపీలో చేరతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన లాయర్ శ్రీనివాసులును ఆయన అనుచరులు బయటకి లాక్కెళ్లారు. 2019లో టీడీపీ ఓటమితో 2023లో వైసీపీలో చేరిన ఆయన తాజాగా మళ్లీ సొంతగూటికి వస్తానంటూ తాడిపత్రిలో జేసీ ఇంటికి వచ్చారు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు కూడా జేసీ ఇష్టపడలేదు. ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పేశారు. అయినా లాయర్ శ్రీనివాసులు వెళ్లకపోవడంతో అనుచరులు కాళ్లు, చేతులు పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. గతంలో ఆయన జేసీపై తీవ్ర విమర్శలు చేశారని, అందుకే శ్రీనివాసులును జేసీ దూరం పెడుతున్నారని టీడీపీ నేతలు తెలిపారు.


అప్పట్లో శ్రీనివాసులు ఇలా
జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుల వ్యక్తిగత న్యాయవాది శ్రీనివాసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల్లో ఒకరిగా శ్రీనివాసులు కొనసాగేవారు. టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉండేవారు. అలా 2019 తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్థితుల కారణంగా... గత ఎన్నికల ముందే లాయర్ శ్రీనివాసులు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో శ్రీనివాసులు వైసీపీలో చేరారు. ఆ సందర్భంగా శ్రీనివాసులు టీడీపీ నేత అయిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు ఎవరైనా తనను కెలికితే ఒక్కరు కూడా ఈ భూమ్మీద మిగలరని శ్రీనివాసులు హెచ్చరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని.. అధికార పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని.. అందువల్లే తాను వైసీపీలో చేరినట్టు అప్పట్లో తెలిపారు. 


దిక్కులేని పరిస్థితుల్లో జేసీ వద్దకు..           
ఎన్నికల ప్రచారంలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి, టీడీపీపై లాయర్ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. కట్ చేస్తే.. గత ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో ఘన విజయం సాధించారు. దీంతో సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలో చేరి.. జేసీని నానా మాటలు అన్న లాయర్ శ్రీనివాసులుకు ఏం చేయాలో పాలుపోలేదు. తన రాజకీయ భవిష్యత్తు కోసం జేసీ ప్రభాకర్ రెడ్డిని మచ్చిక చేసుకోక తప్పని పరిస్థితి ఈయనకు ఏర్పడింది.


ఆ క్రమంలోనే జేసీ ఇంటికి శ్రీనివాసులు వెళ్లారు. తనది తప్పు అయిపోయిందని.. తన విమర్శలను రాజకీయంగానే చూడాలని వేడుకున్నారు. తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలని కోరారు. అందుకు జేసీ అంగీకరించలేదు. ‘ నువ్వు ఇంటికి వస్తే కూర్చోబెట్టినా.. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి..  శ్రీనివాసులుతో కరాకండిగా చెప్పేశారు. అయినా శ్రీనివాసులు వినకుండా వేడుకుంటున్నప్పటికీ జేసీ వినలేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు కాళ్లు చేతులు పట్టుకొని గేటు బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సంచలనం అవుతోంది.