Dubai Latest News: దుబాయ్‌లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఆ దేశ యువరాణి షిఖా మహ్రా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దుబాయ్ రాజు కుమార్తె అయిన షిఖా మహ్రా తన భర్త.. షేక్ మన బిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మన అల్ మక్తూమ్‌తో విడాకులు ప్రకటించారు. ఇలా యువరాణి విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం ప్రస్తుతం అక్కడ సంచలన విషయం అవుతోంది. ఈ విడాకుల విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించడం మరో చర్చనీయాంశంగా మారింది. గత రెండు నెలల క్రితమే యువరాణి షిఖా మహ్రా మొదటి బిడ్డకు జన్మ ఇచ్చినట్లు ప్రకటించారు. 


‘‘డియర్ హస్బెండ్, మీకు ఇతర వ్యాపకాలే ముఖ్యం అయిపోయాయి. కాబట్టి నేను విడాకులు ఇస్తున్నాను. నేను విడాకులు ఇస్తున్నాను. నేను విడాకులు ఇస్తున్నాను.. జాగ్రత్త.. మీ మాజీ భార్య’’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.


యువరాణి షిఖా మహ్రా బింట్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో షేక్ మన బిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మన అల్ మక్తూమ్ వివాహం గతేడాది మేలో జరిగింది. ఆ వివాహం జరిగిన ఏడాదికి వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఆ సమయంలో ఆమె తనకు బిడ్డ పుట్టిన విషయం గురించి దేశ ప్రజలకు ప్రకటిస్తూ.. ఇదొక మర్చిపోలేని సందర్భం అని అన్నారు. తనకు కాన్పు చేసిన ఆస్పత్రి సిబ్బంది అందరికీ షిఖా మహ్రా ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంలో తన భర్త షేక్ మన ఆ బిడ్డను ఎత్తుకొని ఉన్న ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఆ తర్వాత కొద్ది రోజులకు చేసిన ఓ పోస్టు ఎన్నో అనుమానాలు కలిగించింది. ఇక మనమిద్దరం మాత్రమే అంటూ ఆ బిడ్డను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఏకంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.