JC Prabhakar Reddy Protest in Tadipatri: అనంతపురం జిల్లాలో కీలక టీడీపీ నేత అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి నిరసనలతో రోడ్డెక్కారు. తాడిపత్రిలోని స్థానిక సీబీ రోడ్డులో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగారు. నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న కరెంటు స్తంభాలకు మున్సిపల్ ఉద్యోగులు ఎల్‌ఈడీ విద్యుత్ తీగలు అలంకరిస్తున్నారు. ఈ క్రమంలో అప్పటికే ఆ కరెంటు స్తంభాలకు చిన్నపాటి ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తగిలించారు. దీంతో అడ్డుగా ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను, జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ జెండాలను తొలగించకూడదని, వాటిని ముట్టుకోకుండానే మున్సిపల్ సిబ్బందికి జేసీ వైసీపీ నేతలు అడ్డుపడ్డారు.


జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి


ఈ విషయం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలియడంతో ఆయన వెంటనే తాడిపత్రిలోని కాంచన హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వైసీపీ జెండాలను తొలగించి ఎల్ఈడీ లైట్లు వేయాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అదే సమయంలో అలాగే వైసీపీ జండాలను తొలగించవద్దని ఎస్ఐ గౌస్ మునిసిపల్ ఉద్యోగులకు అడ్డుపడ్డారు. ఇది గొడవకు దారి తీసింది. అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయిన జేసీ మరోసారి అక్కడికి చేరుకుని.. పోలీసుల తీరును ప్రవ్నశించారు.  ఎస్ఐ గౌస్ తీరుపై రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలో కొద్దిసేపు కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. తర్వాత ట్రైనీ డీఎస్పీ హామీతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆందోళన విరమించారు.