Janasena Petition In High Court Decision Against EC Decision: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన (Janasena) పార్టీకి గుర్తుల వ్యవహారం ఇబ్బందిగా మారుతోంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా దీనిపై ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్ లో కోరారు. 'ఫ్రీ సింబల్' నుంచి గాజు గ్లాస్ గుర్తును తొలగించాలని ఈసీకి వినతిపత్రం ఇచ్చామని.. ఆ పార్టీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా.. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తులో ఉన్న కారణంగా.. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే కూటమికి నష్టం కలుగుతుందని అన్నారు. అయితే, ఇదే వ్యాజ్యంలో టీడీపీ సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది. అటు, జనసేన అభ్యర్థనపై ఈసీ 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటుందని.. ఈసీ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మే 1వ తేదీకి (బుధవారం) వాయిదా వేసింది.
స్వతంత్ర అభ్యర్థులకు సింబల్
టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ పోటీలో లేని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేన బరిలో లేని నియోజకవర్గాల్లో ఈ గుర్తును ఫ్రీ సింబల్ గా పెట్టి స్వతంత్రులకు ఈ సింబల్ కేటాయించడంతో జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన గుర్తు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. నామినేషన్ల ఉపసంహహరణ గడువు ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడిన వారికి రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్ లో ఉన్న వాటిని అభ్యర్థులకు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఒక గుర్తు కోసం ఎక్కువ మంది పోటీ పడితే డ్రా తీసి గుర్తు కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన సింబల్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు ఉంది. విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిందని ఇండిపెండెంట్లకు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారు.అయితే అలాంటి ఆదేశాలు తమకు రాలేదని.. చెప్పి రిటర్నింగ్ అధికారి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.
రిజర్వ్ చేసినా..
జనసేన గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి.. ఎన్డీయే కూటమి నేతలు ముందుగానే అలర్ట్ అయ్యారు. ఆ గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించాలని ఆ పార్టీ పోటీలో లేకుంటే ఆ గుర్తు ఎవరికీ కేటాయించవద్దని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. వారి విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ కేటగిరీలో పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే, కొన్ని చోట్ల అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించడంతో గందరగోళం నెలకొంది. దీనిపై ఆ పార్టీ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read: Elections 2024 : అనంతపురంలో భారీగా నగదు పట్టి వేత - ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందినదిగా అనుమానం !