Seethe Ramudi Katnam Today Episode : సుమతి తన అన్నతో కలిసిపోతుంది. భర్త, పిల్లల వివరాలు అడిగితే సుమతి అవన్నీ వద్దు అనేస్తుంది. నాలుగు రోజులు అన్నతో గడిపి తర్వాత తీర్థయాత్రలకు వెళ్లిపోతా అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ వద్దని తమతోనే ఉండిపోమని సుమతికి చెప్తారు.
శివకృష్ణ: నిన్ను చిన్నప్పుడు ఎలా చూసుకున్నానో జీవితాంతం అలాగే చూసుకుంటాను.
సుమతి: ఆ అర్హత నేను పోగొట్టుకున్నాను అన్నయ్య. నా గురించి వదిలేయ్ నీ గురించి చెప్పు. నీకు ఎంత మంది పిల్లలు ఏం చేస్తున్నారు.
శివకృష్ణ: ఇద్దరు ఆడపిల్లలు సుమతి ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.
సుమతి: అవునా వాళ్లని నేను చూడాలి అన్నయ్య.
శివకృష్ణ: ఇప్పుడు వద్దులే అమ్మ వాళ్లు ఏవో సమస్యల్లో ఉన్నారు. నీకు వాళ్లని నేను తర్వాత చూపిస్తా.
సుమతి: అవునా నాలా నా మేనకోడళ్లు కూడా కష్ట పడుతున్నారా అన్నయ్య.
శివకృష్ణ: సమయం వచ్చినప్పుడు చెప్తాను అమ్మ వెళ్లి రెస్ట్ తీసుకో. సుమతి గురించి ఇరుగు పొరుగు ఎవరికీ చెప్పకండి. మధు, సీతలకు కూడా చెప్పకండి. తను ఫీలవుతుంది. తన గురించి ఎవరికీ తెలీకూడదు అనుకుంటుంది. సుమతిని జాగ్రత్తగా చూసుకోండి.
లలిత: అలాగే అండి..
మరోవైపు సీత, రామ్‌లు సూర్యని కలవడానికి పోలీస్ స్టేషన్‌కు వస్తారు. వాళ్లని చూసి సూర్య వెళ్లిపోతాడు. సీత అడ్డుకుంటుంది. తనకు బంధువులు స్నేహితులు అంటూ ఎవరూ లేరు అని ఉన్నదంతా శత్రువులే అని అంటాడు. సీత మేం మిమల్ని విడిపించడానికి వచ్చాం బావ అంటే సూర్య ఒప్పుకోడు. మోసపూరిత మాటలు వద్దని సీతని అంటాడు.
రామ్: మిస్టర్ సూర్య ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు.
సూర్య: పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా సార్. నన్ను చూడటానికి ఒకసారి నా భార్యతో వచ్చారు. ఇప్పుడు మీ భార్యతో వచ్చారు. తర్వాత ఎవరి భార్యతో వస్తారో.
సీత: బావ.. మీ నోటికి వచ్చినట్లు మాట్లాడకండి.
సూర్య: మీ అక్క నీ భర్త వాళ్లకి నచ్చినట్లు చేయొచ్చు. నేను మాట్లాడకూడదు అంతే కదా.
రామ్: చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు సూర్య. మీ గురించి మధు గారు రోజూ ఫీలవుతున్నారు.
సూర్య: ఎక్కడ మీ ఇంట్లో ఏసీ గదిలో ఏడుస్తుందా. మేకప్ వేసుకుంటూ ఫీలవుతుందా. మీతో పాటు ఆఫీస్‌కు వస్తూ బాధ పడుతుందా.. నేను జైలులో ఉన్నా మొత్తం తెలుస్తాయి. నేను బయటకు వచ్చాక మీ పని చెప్తాను.
సీత: నీకు ఎవరో కల్పించి చెప్తున్నారు బావ. అక్క రోజూ నీ గురించి బాధ పడుతుంది.
సూర్య: మధు నా గురించి బాధ పడేది అయితే నా కోసం వచ్చేది. నేను తనకు అక్కర్లేదు అని అర్థమైంది. నన్ను వదిలించుకోవాలి అని చూస్తుంది. నా మీద ప్రేమ తనకు చచ్చిపోయి చాలా రోజులు అయింది.
సీత: అక్కకు మీ మీద ప్రేమ లేదు అని మీరు అనుకుంటున్నారు. తన మీద మీకు ప్రేమ తగ్గిపోయింది అని అక్క అనుకుంటుంది. బయటకు వచ్చి మాట్లాడాక మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నువ్వు త్వరలోనే బయటకు వస్తావు. మా అక్కతో కలిసి సంతోషంగా ఉంటావు.
సూర్య దగ్గర నుంచి సీత, రామ్‌లు శివకృష్ణ ఇంటికి వస్తారు. వాళ్లని చూసిన శివకృష్ణ ఆందోళన పడతాడు. సడెన్‌గా వీళ్లు వచ్చారు ఏంటని సుమతి వాళ్లని చూడకూడదు అని సుమతి గురించి సీత వాళ్లకి తెలీకూడదు అని అంటాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు.
లలిత: మీరు ఎక్కడికెళ్లి వస్తున్నారు.
సీత: జైలుకి వెళ్లి సూర్య బావని కలిసి వస్తున్నాం. సూర్య బావ పరిస్థితి ఏం బాలేదు. నాన్న త్వరగా బావని నువ్వే బయటకు తీసుకురావాలి. ఏదో ఒకటి చేయు నాన్న.
శివకృష్ణ: నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాన్న. నువ్వే ఏదో ఒకటి చేయాలి.
ఇంతలో సుమతి వచ్చి.. కారు ఎవరిది ఇంటికి ఎవరు వచ్చారని అనుకుంటుంది. ఇంతలో రామ్, సీతలు బయల్దేరుతాం అంటారు. సుమతిని చూసిన తన అన్నా వదినలు షాక్ అవుతారు. రామ్, సీతలు సుమతిని చూసేస్తారేమో అని టెన్షన్ పడతారు. ఇంతలో సుమతి మీద చీర పడుతుంది. ఆ చీరని సుమతి ఆరేయడానికి తీసుకువెళ్లడంతో ఒకరికి ఒకరు ఎదురు పడరు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సుమతి ఎవరు వచ్చారని అడిగితే శివకృష్ణ వాళ్లు కవర్ చేస్తారు.
ఇక సీత, రామ్‌లు తాము ఇంటికి వెళ్లినందుకు ఎవరూ ఆనందపడకుండా టెన్షన్ పడ్డారని అనుకుంటారు. ఇక సీత, రామ్ ఇద్దరూ గుడికి వెళ్లి సూర్య పేరున అర్చన చేయిస్తారు. ఇక గుడిని అలంకరించడం చూసి ఏంటి విశేషం అని అడుగుతారు. దీంతో పంతులు సీతా రాములు కల్యాణం రేపు జరుగుతుందని అంటారు. వెంటనే సీత.. శ్రీరామ నవమి అయిపోయింది కదా ఇప్పుడు కల్యాణం ఏంటని అడుగుతుంది.
పంతులు: ఈ ఊరికి ఒక విశేషం ఉందమ్మా. కౌసల్యాపురం అనే ఈ ఊరు రాముల వారి తల్లిగారి పేరుతో ఏర్పడింది. పాతిక ఏళ్ల క్రితం ఈ గుడి కట్టి రాముల వారి విగ్రహ ప్రతిష్ట చేశారు. రేపే ఆ ప్రతిష్ట జరిగిన రోజు అందుకే ప్రతి సంవత్సరం రేపటి రోజున స్వామి వారి కల్యాణం ఆనవాయితీగా వస్తుంది. నూతన దంపతులు రేపు సీతారాముల కల్యాణం జరిపిస్తారు.
సీత: మాకు ఈ మధ్యనే పెళ్లి జరిగింది. మామ మనం రేపు ఇక్కడికి వచ్చి కల్యాణం చేయిద్దాం.
రామ్: మా పిన్ని ఒప్పుకుంటేనే..
సీత: మీ పిన్నిని నేను ఒప్పిస్తా మామ.
మహాలక్ష్మి అందర్ని పిలిచి రామ్, సీతలు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఎవరికీ చెప్పకుండా వెళ్లారని తలా ఓ మాట అంటారు. ఇంతలో సీత, రామ్‌లు వస్తారు. ఎక్కడికి వెళ్లారని మహా అడిగితే జైలుకి వెళ్లి సూర్యని కలిసి వచ్చామని చెప్పారు. తన బావని విడిపించే ప్రయత్నాలు చేస్తున్నామని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.