Satyabhama Today Episode పెళ్లి వాళ్లు సంధ్యని చూసుకోవడానికి వస్తారు. నందిని పెళ్లి సంబంధం చెడగొట్టాలి అనుకుంటుంది. ఇక క్రిష్ తన భార్యని పొగుడుతాడు. తన భార్యే అంత మంచిది అయితే ఇక మరదలు ఇంకెంత మంచిదాయో అని కళ్లు మూసుకొని పెళ్లికి ఓకే చెప్పొచ్చని అంటాడు. క్రిష్ మాటలు విన్న పెళ్లికొడుకు తల్లి ప్రేమ విషయం అడగమని తన భర్తకు చెప్తుంది. దీంతో అతడు రాగానే అడిగితే బాగోదు అని ముందు అమ్మాయిని పిలిపిద్దామని అంటాడు. సత్య సంధ్యని తీసుకొని వస్తుంది.  


పెళ్లికొడుకుతండ్రి: మేం కారులో వస్తుంటే ఎవరో దారిలో ఫోన్ చేసి చెప్పారు. మీ అమ్మాయి ఎవరినో లవ్ చేసింది అని నిజమేనా.. 


నందిని: అంటే మీరు మా సంధ్యనే అనుమానిస్తున్నారా. నలుగురిలో కూర్చొబెట్టి అడగకూడని ప్రశ్న అడుగుతున్నారా. చూడండి మీరు అడిగిన ప్రశ్నకు మా సంధ్య ఎంత బాధపడుతుందో. వేరే ఎవర్నో ప్రేమిస్తే పెళ్లి చూపులకు ఎట్లా కూర్చొంటుంది. 


పెళ్లికొడుకుతండ్రి: మీరు అపార్థం చేసుకుంటున్నారు. మేం మీ అమ్మాయిని అనుమానించడం లేదు. అనుమానిస్తే ఇక్కడి వరకు వచ్చే వాళ్లం కాదు అటునుంచి అటే వెళ్లిపోయేవాళ్లం. మీరు బలవంతంగా అమ్మాయిని ఒప్పించారు అంటేనూ నిజం ఏంటో తెలుసుకుందామని వచ్చాం.


విశ్వనాథం: ఎవరు చెప్పారో కానీ మీరు విన్నది అంతా అబద్దం అండి. మా అమ్మాయి మీద ఒట్టు వేసి చెప్తున్నాను.


పెళ్లికొడుకు తల్లి: కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా అబద్దమే చెప్తారు.


నందిని: అసలేమనుకుంటున్నారు మా మామయ్య గురించి ఆయన అబద్దం చెప్తారు అనుకుంటున్నారా. 


హర్ష: నందిని నువ్వు ఉండు. పెద్దలు మాట్లాడుకుంటున్నారు కదా.


క్రిష్: నందిని నువ్వు ఆగు..


నందిని: ఏంటి అన్న ఆగేది పెళ్లి చూపుల్లోనే అనుమానించారు. రేపు పెళ్లి అయితే సతాయించుకు తింటారు. 


శాంతమ్మ: మనసులో.. ఇదేంటి ఇలా రెచ్చిపోతుంది. పూనకం వచ్చినట్లు. 


క్రిష్: ఏయ్ నందిని నువ్వు ఉండు..


నందిని: నా కళ్లు ముందు అమ్మాయిని మాటలు అంటే నేను ఊరుకోను అన్న. అయినా సంధ్య మీ కోడలు అయితే రోజుకో అక్రమ సంబంధం పెట్టినట్లు ఉన్నావ్.


పెళ్లికొడుకు తల్లి: అమ్మాయ్ మర్యాదగా మాట్లాడు. అమ్మాయి ప్రేమ గురించి అడిగితే చెప్పకుండా ఏదేదో మాట్లాడుతారు ఏంటి. ఇదేనా మీ సంస్కారం. నింద పడింది నిజమే కాదో తెలుసుకోవడం తప్పా. క్రిష్‌లో నువ్వు చెప్పు నీ మరదలు ఎవరినో ప్రేమించి రేపు పెళ్లి అయిన తర్వాత లేచిపోతే మా పరిస్థితి ఏం కావాలి.


నందిని: ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్లురాలుతాయ్. మా అత్తామామ మెత్తనోళ్లు.. నేను కాదు. మా వాళ్లని ఇంకొక్క మాట అన్నా నేను ఒప్పుకోను. 


ఇదంతా కాదు అని క్రిష్ పెళ్లి కొడుకును ఫోన్ నెంబరు అడుగుతాడు. నందిని దొరికిపోతామని టెన్షన్ పడుతుంది. అబ్బాయి ఆ నెంబరుకి ఫోన్ చేయగానే స్విఛ్ ఆఫ్ వస్తుంది. దీంతో హర్ష ఎవరో కావాలనే చేసి ఉంటారని అంటుంది. దీంతో పెళ్లి కొడుకు మీ గురించి తెలిసిన వారే చేసుంటాడు అని అంటాడు. దీంతో నందిని కలుగ జేసుకొని పెళ్లి కొడుకుని అవమానిస్తుంది. దీంతో పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు. అందరూ బాధ పడతారు. సంధ్య ఏడుస్తుంది. విశ్వనాథం తలపట్టుకుంటాడు. హర్ష కోపంగా భార్య దగ్గరకు వెళ్తాడు. 


హర్ష: వాళ్లకి ఫోన్ చేసి సంబంధం చెడగొట్టింది నువ్వే కదా. నీకు తప్ప వేరే అవసరం ఎవరికీ లేదు.


క్రిష్: బావ పిచ్చోడి లెక్క చేయకు.


హర్ష: నీ చెల్లి బుద్ధి నీకు తెలీదు. 


నందిని: చూడు అన్న చూడు సంధ్యని వాళ్ల అన్ని మాటలు అంటే నేను అరిచినా.. ఈ దొర ఒక్క మాట అన్నాడా. వాళ్ల నాయనని అన్ని మాటలు అంటున్నా రోషం లేనోడి లెక్క ఊరుకున్నాడు. ఇప్పుడు ఆడదాన్ని నా మీద నోరు లేపుతున్నాడు చూస్తున్నావ్ కదా. 


హర్ష: డౌట్ లేదు సత్య. నేను పంతంతో తనని పెళ్లి చేసుకున్నాను అని సంధ్యకు వచ్చిన మంచి సంబంధం చెడగొట్టి మన మీద పగ తీర్చుకుంటుంది. నా మీద కోపం ఉంటే నన్ను ఏమైనా చేయ్. నా చెల్లి క్యారెక్టర్ గురించి చెడుగా ఎందుకు చెప్తున్నావ్. 


విశ్వనాథం: హర్ష వదిలేయ్ రా .. ఇప్పటి వరకు అయిన గొడవ చాలు. పోయిన పరువు చాలు. ఇక ఈ బాధని తట్టుకునే శక్తి నాకు లేదురా. నా ముందే నా కూతుర్ని అన్ని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయాను.


హర్ష: అసలు ఈ అవమానానికి ఈ కన్నీళ్లకు కారణం ఈ రాక్షసే నాన్న. అని హర్ష నందినిని కొట్టబోతే క్రిష్ అడ్డుకుంటాడు.


నందిని: అన్న నీ ముందే నా మీదకు చేయి ఎత్తాడు అంటే ఇన్నాళ్లు ఈ ఇంట్లో నేను ఎంత నరకం అనుభవించానో అర్థం చేసుకో.


సత్య: నందిని గొడవ పెంచకు.


హర్ష: చేయి వదులు.


క్రిష్: వదలను.. నా కళ్ల ముందు నా చెల్లిని కొడతా అంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా..


హర్ష: నా కళ్ల ముందే తను నా చెల్లికి నిందలు పడేలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను.


క్రిష్: నువ్వు తిక్కలోడివా.. దిమాక్ ఉందా నీకు. నా చెల్లి తన అత్తింటి పరువు పోతుంటే నిలబడింది. నీకు అర్థం కాకపోతే నీ సత్యని అడుగు. అంతే కానీ నా చెల్లి మీద దౌర్జన్యం చేయకు. మర్యాదగా ఉండదు చెప్తున్నా.


హర్ష: నా ఫ్యామిలీ విషయంలో తప్పు చేస్తే నీ చెల్లినే కాదు ఎవర్నీ వదలను. ఇది చిన్నప్పుడు పాలు తాగి పెరగలేదు. విషం తాగి పెరిగింది. నీకు మీ అమ్మానాన్నలు మనుషులతో ఆడుకోవడం నేర్పారు. అందుకే సాటి ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇంతకు తెగించావ్. నేను నిన్ను అని లాభం లేదు మీ అమ్మని బాబుని అనాలి. 


ఆ మాట అనగానే క్రిష్ కోపంతో ఏం కూశావురా అని హర్షని కొడతాడు. అందరూ అడ్డుకోవాలని చూసినా ఆగకుండా కొడతాడు. ఇక మధ్యలోకి వెళ్లిన విశ్వనాథాన్ని క్రిష్ తోసేస్తాడు. దీంతో విశ్వనాథం తలకు దెబ్బ తగులుతుంది. కోపంతో సత్య క్రిష్‌ని లాగిపెట్టి కొడుతుంది. 


సత్య: క్రిష్ నువ్వేం చేస్తున్నావ్ నీకు అర్థమవుతుందా.. నువ్వు మా నాన్న మీద చేయి లేపావు. తోసేశావ్. రక్తం వచ్చింది.


క్రిష్: ఆయనే అడ్డం వచ్చాడు.


సత్య: అయితే చూసుకోవా. చంపేస్తావా.. పెద్ద వాళ్లు అంటే ఇదేనా నీకు ధైర్యం. 


విశ్వనాథం: నాకు ఏం కాలేదు అమ్మ. నా వల్ల మీరు గొడవ పడొద్దు. బాబు క్షమించండి..


సత్య: నాన్న వద్దు.. మిమల్ని గాయపరిచింది ఆయన ఆ మనిషే మీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. 


నందిని: చూశావా అన్న ఫ్యామిలీ మొత్తం ఎలా రెచ్చిపోతున్నారో. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు.


విశ్వనాథం: అమ్మా నందిని వద్దమ్మా..


నందిని: నీ సంస్కారం కంటే మా అన్న సంస్కారం చాలా గొప్పది. మీ జాగాలో వేరే ఎవరైనా ఉండి ఉంటే పీకలు తెగేవి.


సత్య: అంతే అంతే మీకు చేతనైంది అంతే. చంపడం.. నరకడం.. అదేదో పెద్ద గొప్ప అన్నట్లు చెప్పున్నారు. సిగ్గులేకపోతే సరి ఛీఛీ.. 


సత్య అలా అనగానే క్రిష్ కోపంతో కొట్టబోయి చేయి దించేస్తాడు. కోపంతో వెళ్లిపోతాడు. విశ్వనాథం బాధపడి కుప్పకూలిపోతాడు. సత్య జరిగింది తలచుకొని బాధ పడుతుంది. మరోవైపు క్రిష్ కూడా గొడవ తలచుకుంటాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణకు నిజం తెలిస్తే గుండె పగిలిపోవడం ఖాయమన్న ముకుంద.. మురారి బిడ్డను తానే కనబోతుందా!