తన బిడ్డల కోసం దాచుకున్న డబ్బులతో తాను జనసేన పార్టీ ఆఫీసు కట్టుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. తన బిడ్డల బదులు ప్రజలంతా తన బిడ్డలు అని అనుకున్నానని అన్నారు. పార్టీని పదేళ్లు నడపడం సాధారణ విషయం కాదని, రూ.10 వేల కోట్లు ఉన్నా ఒక రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని అన్నారు. ప్రజలు వ్యక్తిని గుండెల్లో పెట్టుకుంటే తప్ప పార్టీని నడపలేమని అన్నారు. భావజాలం అర్థం చేసుకునే వ్యక్తులుంటేనే పార్టీని నడపగలం అని అన్నారు. జనసేన పార్టీని నడిపేందుకే తాను సినిమాలు చేస్తున్నానని చెప్పారు. అలాంటి తనపై కక్షతో తన సినిమాలు అడ్డుకున్నారని అన్నారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సీఎం జగన్ అక్కడ కూడా దిగజారిపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభను కాకినాడ జిల్లా కత్తిపూడి (Kattipudi) లో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు.


భవిష్యత్తులో వైఎస్ఆర్ సీపీని ఎదుర్కొనేది వైఎస్ఆర్ సీపీ మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. తన పోరాటం అక్రమార్కులతోనే అని అన్నారు. ‘‘అక్రమంగా రూ.వేల కోట్లు కూడబెట్టిన వారితోనే నా గొడవ. సీఎం అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరు ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే దోపిడీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది చాలా అవసరం. తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటా. నన్ను పాలించేవారు నా కంటే నిజాయితీపరుడై ఉండాలనేదే నా కోరిక. నన్ను విమర్శించే నాయకులందరి వ్యక్తిగత విషయాలు తెలుసు. జగిత్యాల నుంచి ఓ అభిమాని నా దగ్గరకు వచ్చి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చాడు. అందులో తనను తిట్టిన వారి వ్యక్తిగత విషయాలు, గూడుపుఠాణీలు ఉన్నాయని చెప్పాడు. కానీ, నేను సంస్కారంతో వాటిని బయటపెట్టడం లేదు. వ్యక్తిగత విషయాలు కాకుండా వ్యవస్థకు వ్యతిరేకంగా నేను పోరాడతా’’


వైసీపీ నేతల తప్పుడు పనులకు సంబంధించి నా దగ్గర చాలా ఫైళ్లు ఉన్నాయి. అవన్నీ చదవి చదివి నేను అలసి పోయాను. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లను. ఒక పాలసీ విధంగానే నేను విమర్శలు చేస్తున్నా. రాష్ట్రంలో కీలక పోస్టులన్నీ ఒక కులానికే పరిమితం చేయడం సరికాదు. అమరావతి ఒక కులానికే చెందినది అనుకుంటే పొరపాటు. ఆనాడే జగన్‌ ఎందుకు వ్యతిరేకించలేదు? ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. అన్ని కులాలకు న్యాయం చేయాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.