Srihari Rao Joins Congress Party: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఉద్యమ నేత కూచాడి శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీహరి రావుతో పాటు సికింద్రాబాద్ కు చెందివన నోముల ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీహరి, ప్రకాష్ గౌడ్ లకు పార్టీ కండువా కప్పిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరి రావు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం శ్రమించారు. ప్రస్తుతం ఆయనది నిర్మల్ జిల్లా. తన ముఖ్య అనుచరులతో మంగళవారం సమావేశం అయిన తరువాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శ్రీహరి రావు సంచలన ప్రకటన చేశారు. నేడు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఎవరీ శ్రీహరి రావు..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో శ్రీహరి రావు క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. దీంతో ఆయనకు బిఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పగా వాటిని సైతం ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. కానీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేయడం పట్ల నిర్మల్ జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని భవిస్తున్నారు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో తమకు సరైన స్థానం దక్కడం లేదని అధిష్టానంపై కోపంగా ఉన్న ఆయన ఈనెల 4న నిర్మల్ లో నిర్వహించిన కేసీఆర్ సభకు సైతం హాజరు కాలేదు. జూన్ 13న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు శ్రీహరి రావు. అలాంటి నేత తనను, తన అనుచరులను పట్టించుకోవడం లేదని ఉద్యమ నేత ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించే కార్యక్రమాలకు సైతం తనకు ఆహ్వానించడం లేదన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని, ఉద్యమ నేతలను పక్కనపెట్టడం పద్ధతి కాదన్నారు. ఈ క్రమంలో ఇటీవల సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లాలో పర్యటించిన కార్యక్రమానికి దూరంగా ఉన్న ఆయన పార్టీని వీడాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పార్టీ కాంగ్రెస్ లో చేరడం ఉత్తమం అని ఇటీవల మీడియాతో అన్నారు.
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో మార్పు మొదలైందని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం, తుఫాన్ రూపంలో ప్రభావం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. శ్రీహరి రావు ఉద్యమ నేతగా సేవ చేశారని, బీఆర్ఎస్ లో దగా పడి తమ పార్టీలో చేరారన్నారు. ఆయన చేరికతో నిర్మల్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. వెళ్లిపోయే వాళ్లు పార్టీని వీడుతున్నా, బలమైన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.