TDP News :   తెలుగుదేశం పార్టీ ఇటీవల మినీ మేనిఫెస్టో ప్రకటించింది. ఆరు పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రత్యేకమైన ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది.  భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బస్సు ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.  రాష్ట్రవ్యాప్తంగా జోన్లవారీగా 5 బస్సులు 125 నియోజకవర్గాల్లో తిరగనున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.  నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు బస్సుల్లో వెళ్లి ప్రజలతో మమేకమవుతారని ఆయన తెలిపారు.  మహిళలు, రైతులు, యువత, బీసీలు, పేదల్ని ఆదుకోవడమే లక్ష్యంగా, వారి సంతోషం, సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్లనుంది. వారికోసం చంద్రబాబు, టీడీపీ అమలు చేయబోయే కార్యక్రమాల్ని ప్రతిఒక్కరికీ తెలియచేయడంకోసం బస్సు ప్రచారం ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

ఒక్కో జోన్‌కు ఒక్కో బస్సు 

తెలుగుదేశం పార్టీ జోన్ స్థాయిలో ఔట్  రీచ్ ప్రోగ్రామ్ చేపట్టాలని నిర్ణయించుకుంది.  మొత్తం ఐదు జోన్లకు ఐదు బస్సులు కేటాయిస్తున్నారు.  బస్సుల్ని అధునాతన హంగులతో తీర్చిదిద్ది 125 నియోజకవర్గాల్లో 30 రోజులపాటు తిప్పనున్నారు.   ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి క్యాడర్ బస్సులో ఉండి ప్రజలతో మాట్లాడేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.  అలాగే ప్రజల కష్ట సుఖాలు, బాధలు తెలుసుకొనిః చంద్రబాబు వారి కోసం తీసుకొచ్చిన 'భవిషత్‌కు గ్యారెంటీ' పథకాలను వివరిస్తారు.  అలానే జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న దోపిడీని, దారుణాలను తెలియచేస్తారని తెలిపారు. వీటితోపాటు ప్రజలతో కలిసి పల్లె నిద్రచేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో వారిభాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. 

19న  ప్రారంభించనున్న చంద్రబాబు

ఈనెల 19న చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బస్సుల్ని ప్రారంభించనున్నారు.  రాష్ట్రంలోని తెలుగు దేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జోనల్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతినియోజకవర్గంలో బస్సులపై తిరిగి, ప్రజల కష్టాలతోపాటు, వారి అభిప్రాయాలు తెలుసుకొని, భవిష్యత్‌లో రాష్ట్రం కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ ఇచ్చిన  హామీలు ఇవే ! 

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు.  3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. పేదలను ధనవంతులు చేయడం కాన్సెప్ట్ తో.. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని టీడీపీ ప్రకటించింది. రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రకటించారు ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. రెండోది బీసీలకు రక్షణ చట్టం. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.   “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది అన్న దాత ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది.   మహిళ ‘మహా’ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు. ఆరో స్కీమ్ కింద యువగళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుందని… ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని తెలిపింది.