Jagan Fights For Leader of Opposition Status : ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తానే ప్రతిపక్ష నాయకుడ్నని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో స్పీకర్ కు లేఖ రాశారు. తాజాగా ఆ హోదా ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఆయనను వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే గుర్తించారు. దీంతో వెంటనే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‍లో జగన్ పేర్కొన్నారు.
ఏపీలో అధికార పార్టీ కాకుండా ఉన్న మరో పార్టీ తమదేనని జగన్ చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో పది శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదని జగన్ ఇంతకు ముందు స్పీకర్‌కు లేఖ రాశారు. మామూలుగా అయితే పది శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. రెండు, మూడు పార్టీలకు పది శాతం కన్నా ఎక్కువ సీట్లు వస్తే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తిస్తారు. కానీ ఏపీలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది. కనీసం పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఇలా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను అడగాల్సి వచ్చేది కాదు.
కానీ స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలని జగన్ అడుగుతున్నారంటేనే.. నిబంధనల ప్రకారం ఆయనకు రావాల్సిన సీట్లు రాలేదని అర్థం అవుతుందని.. అలాంటి రూల్ లేనప్పుడు అడగాల్సిన అవసరం ఏముందని .. ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నేత హోదా వస్తుంది కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పది శాతం సీట్లు రాలేదు. అందుకే ఆ పార్టీ పక్ష నేతను ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గానే పార్లమెంట్ లో ఆ పార్టీ నేత వ్యవహరించారు.
తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన తీర్పు రాలేదు. స్పీకర్ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశం లేదని న్యాయనిపుణలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోర్టు ఆదేశించినా.. స్పీకర్ పాటించాల్సిన అవసరం లేదని.. శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదని అంటున్నారు. ముఖ్యంగా సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేరని చెబుతున్నారు. మొత్తంగా జగన్పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.