Complaint About Collision Of Boats In Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు శుక్రవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యాంకు వరద పోటెత్తిన క్రమంలో ఒకేసారి 4 మర పడవలు రావడంపై అనుమానాలున్నాయని అన్నారు. అవి గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా, ఇటీవల భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన 3 భారీ పడవలు, ఓ చిన్న పడవ ఎగువ నుంచి ప్రవాహానికి వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో నీరు కిందకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 40 కి.మీ వేగంతో వచ్చిన బోట్లు ఢీకొనగా బ్యారేజీలోని ఓ పిల్లర్ దెబ్బతింది. దీంతో ప్రభుత్వం జల వనరుల నిపుణుడు కన్నయ్య నాయుడుని రంగంలోకి దించింది. ఆయన పర్యవేక్షణలో సిబ్బంది పనులు చేపట్టారు.
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద
మరోవైపు, ఎగువ నుంచి వస్తోన్న వరదతో శ్రీశైలం జలాశయం మళ్లీ నిండుతోంది. ప్రస్తుతం 1.64 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం నాగార్జున సాగర్‌కు 67,631 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884.5 అడుగులుగా ఉంది. గరిష్ఠ నిల్వ 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.9 టీఎంసీలుగా ఉంది. అటు, కుడి, ఎడమ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.