ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా.. క‌నీసం కుటుంబానికి రాజ‌కీయ నేప‌థ్యం లేక‌పోయినా ఆమె అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆరంగేట్రంలోనే ఊహించ‌ని రీతిలో పిన్న‌వ‌య‌సులోనే విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠాన్ని అధిష్ఠించారు. అనంత‌రం పార్టీలో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్ర‌స్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఆమే.. తెలుగుదేశం పార్టీ నాయ‌కురాలు పంచుమ‌ర్తి అనూరాధ‌.


1999 సంవత్సరంలో నూత‌న రాజ‌కీయాల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తటస్థులను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్న విష‌యం పంచుమ‌ర్తి అనూరాధ‌కు తెలిసింది. వెంట‌నే రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉంద‌ని తెలియ‌జేస్తూ ఆమె.. తన విద్యార్హ‌త‌లు, కుటుంబ వివరాలను టీడీపీ కార్యాలయానికి పంపారు. అయితే ఆమెకు అప్పుడు పిలుపురాలేదు. ఆ త‌ర్వాత సంవత్సరం అంటే 2000లో.. విజయవాడ నగరపాలక సంస్థకు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. మేయర్‌ పదవి బీసీ మహిళలకు కేటాయించారు.


అప్పుడు.. తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి అనూరాధకు పిలుపు వచ్చింది. మేయర్‌ టికెట్‌ కోసం 18 మంది పోటీ పడినా విద్యాధికురాలు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు టికెట్‌ ఖరారు చేయడం.. అనురాధ మేయర్‌గా ఎన్నిక కావడం జరిగిపోయింది. అప్పటికి ఆమె వయసు 26 సంవత్సరాలు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె పేరు ఇప్పటికీ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదై ఉంది.


రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశంతోనే మేయర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనురాధకు స‌మ‌స్య‌లు స్వాగ‌తం ప‌లికాయి. ఆ ఎన్నిక‌ల్లో 50 డివిజన్లలో టీడీపీకి కేవలం 9 స్థానాలు మాత్రమే దక్కాయి. రాజకీయంగా అనుభవం లేకపోవడం.. కౌన్సిల్‌లో బలం లేకపోవడంతో ఆమె మొదట్లో కాస్త తడబడినా పట్టుదలతో ట్యూష‌న్ పెట్టించుకుని మ‌రీ చట్టాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. అయినా కాంగ్రెస్‌, సీపీఐ కార్పొరేటర్ల నుంచి ఆమెకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యేవి. పార్టీ ప‌రంగా కౌన్సిల్‌లో బ‌లం త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌ పాలకవర్గ సమావేశంలో ఆమె ప్రతిపాదనలు చెల్లేవి కావు. అప్పుడామె ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు న‌గ‌రంలోని స‌మ‌స్య‌లు వివ‌రించి.. విజయవాడలో పలు అభివృద్ధి పథకాలకు నిధులు సాధించారు. ఈ క్రమంలో అన్నింటికీ ప్రభుత్వం నుంచే నేరుగా జీవోలు వచ్చేవి. అలా ఆమె మేయర్‌గా ఉండగా దాదాపు 17 జీవోలు వచ్చాయి. దీంతో అనూరాధ‌ను జీవోల మేయరని పిలిచేవారు. కానీ పట్టుదలతో ప‌నిచేసి ఆమె మేయర్‌గా నగర ప్రజల మనస్సులను గెలుచుకున్నారు.


చేనేత సామాజిక వర్గానికి చెందిన అనూరాధకు 2015లోనే ఎమ్మెల్సీ పదవి దక్కాల్సి ఉంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నామినేషన్‌ వేసేందుకు పత్రాలు లేకపోవడంతో చివరి నిమిషంలో ఆ సీటును ప్రతిభాభారతికి కేటాయించారు. అయితే పదవులతో సంబంధం లేకుండా అనూరాధ పార్టీకి విధేయురాలిగా కొన‌సాగారు. ఒకానొక దశలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఇక రాజకీయాలకు స్వస్తి చెబుతారని అంద‌రూ భావించినా.. మొక్క‌వోని ధైర్యంతో కోలుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించిన చంద్ర‌బాబు 2015లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆమె టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంతేకాకుండా గత 15 ఏళ్లుగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. తీర ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గానికి సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిసినా.. పార్టీ అధినేత సూచన మేరకు పోటీచేసి.. అనూహ్య‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు.


అనురాధ తండ్రి స్వర్గం పుల్లారావు ఆదాయ పన్నుల శాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేశారు. ఆమె డిగ్రీ చదువుతుండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్‌తో వివాహమైంది. వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించిన ఆమె... 1996లో డిగ్రీ పూర్తి చేశారు. 2007లో జర్నలిజంలో పీజీ పట్టా తీసుకున్నారు. మేయ‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆహ్వానం మేరకు 300 మంది ట్రైనీ ఐఏఎస్‌లను ఉద్దేశించి.. ‘నాయకత్వ కళ, మంచి పరిపాలన కోసం బ్యూరోక్రాట్‌లు, రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు’ అన్న అంశంపై ప్రసంగించారు.