ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదీ కలసి రావడం లేదు. ఒక్కో శాఖ ఉద్యోగులు వరుసగా ఆందోళనబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సమ్మె నోటీసు ఇచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమానికి సిద్ధమయ్యారు. పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు ఓకే అంటే తాము అప్పుడు బస్సులు ఆపేస్తామని ఆర్టీసీ యూనియన్లు ప్రకటించాయి. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వ ఇంధనశాఖ కార్యదర్శికి విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 5 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సీఎంకు సోషల్‌మీడియా, పోస్ట్‌కార్డుల ద్వారా వినతులు అందిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7 నుంచి 16 వరకు లంచ్ అవర్‌లో ఆందోళనలు చేస్తామని తెలిపింది. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని పేర్కొంది. మార్చి 2న సిమ్‌కార్డులు హ్యాండోవర్ చేయాలని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత సమ్మె చేస్తామని ఉద్యోగులు చెప్పలేదు. విద్యుత్ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఆరు నెలలకోసారి ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తోంది.
విద్యుత్ ఉద్యోగులు ట్రాన్స్‌కో , జెన్ కో కిందకు వస్తారు. ఏపీ ప్రభుత్వం గత కేబినెట్ భేటీలో కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ చేయాలని నిర్మయించింది. ఈ నిర్ణయాన్ని విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగులు కొంత కాలంగా అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. వారి జీతాలను పెద్ద మొత్తంలో తగ్గించడానికి దాదాపుగా కసరత్తు చేశారని ప్రచారం జరుగుతోంది. విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఉద్యోగులకు పెద్ద ఎత్తున లబ్ది చేకూరింది. ఫిట్‌మెంట్‌తో పాటు ఏడాదికి మూడు వంతున ఒక్కో ఉద్యోగికి 18 ప్రత్యేక ఇంక్రిమెంట్లు వచ్చాయి. అందుకే సుదీర్ఘ సర్వీస్ ఉన్న స్వీపర్‌కు కూడా రూ. లక్ష వరకూ జీతం అందుకుంటున్న వారు ఉన్నారు. ఉద్యోగుల జీతాల్లో మాస్టర్ స్కేల్‌కు మించిన మొత్తాన్ని పర్సనల్ పేలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఉద్యోగుల భావిస్తున్నారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు.
ప్రభుత్వం తమ జీతాలను తగ్గిస్తుందన్న భయంతో చాలా మంది విద్యుత్ ఉద్యోగులు గత రెండేళ్లలో స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న వారు స్వచ్చంద పదవి విరమణ చేయడానికి అవకాశం ఉంది. ఇలా చేస్తే వారికి పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు లభిస్తాయి. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న వందలాది మంది ఇంజినీర్లు తమకు ఐదేళ్లలోపు సర్వీస్‌లోకి రాగానే వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఇప్పటికి వంద మందికిపైగా దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ సంస్థల ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమల్లోకి వస్తే ఒక్కో ఉద్యోగి రూ. యాభై లక్షల వరకూ పదవీ విరమణ ప్రయోజనాలు పోగొట్టుకుంటారని.. పెన్షన్ కూడా సగానికి సగం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి జీతాలు తగ్గించబోమని హామీ ఇస్తోంది. కానీ నిర్ణయాలు జరిగిపోతున్నాయన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు.