సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు మొండి పట్టుదలకు వెళ్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రభుత్వం చర్చలకు రమ్మంటే ఉద్యోగులు అలుసుగా తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం కొన్ని ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చాయని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చామని మంత్రి తెలిపారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ప్లే స్లిప్ వచ్చాక చూసుకుంటే జీతాలు పెరుగుతాయా లేక తగ్గాయా తెలుస్తోందన్నారు. ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదని మంత్రి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు ఎవరు ముందుకు వచ్చిన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులకు సమస్య అంటే ప్రభుత్వ సమస్య అన్నారు. ఉద్యోగులు ఘర్షణ వాతావరణం వీడి చర్చలకు రావాలని కోరారు. ఉద్యోగులు ఎప్పుడు వస్తామంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురుచూడమని ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని మంత్రి బొత్స అన్నారు.
ఒక్క రూపాయి జీతం తగ్గదు
ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన సమితి చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. జీతాలు వస్తేనే కదా పెరుగుతాయా, తగ్గుతాయా అనేది తెలుస్తోంది అన్నారు. ఉద్యోగులెవ్వరికీ రూపాయి కూడా జీతం తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ శుక్రవారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామన్నారు. ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం అందుబాటులో ఉందని మరోసారి స్పష్టం చేశారు.
Also Read: అపోహలు తొలగించుకునేందుకు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రెడీ... కమిటీతో చర్చలకు అంగీకారం !
ఆర్టీసీ సంఘాలు సమ్మెకు మద్దతు
ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. ఆర్టీసీలోని ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు చెబుతున్నారు. తమకు పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరమేనని కానీ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సమ్మెకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.